NEET-UG paper leak case: నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టులు మొదలుపెట్టిన సీబీఐ

నీట్‌ పేపర్‌ లీక్‌పై దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. అరెస్టులు మొదలుపెట్టింది. ఇక రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను బదలాయించమని కోరింది. 

Published : 27 Jun 2024 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్: నీట్‌-యూజీ 2024 పరీక్ష పేపర్‌ లీక్‌ కేసు (NEET-UG paper leak case) దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. దీనికి సంబంధించి అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్‌ ప్రకాశ్‌, అశుతోష్‌ను బిహార్‌లోని పట్నాలో అదుపులోకి తీసుకొంది. ఈ కేసులో లీకైన పేపర్‌ను పొందిన విద్యార్థులను మనీశ్‌ తన కారులోనే తరలించినట్లు గుర్తించారు. వీరిలో రెండు డజన్ల మందికి అతడే ఒక రూమ్‌ కూడా బుక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో నిందితుడైన అశుతోష్‌ పేపర్‌ లీక్‌లో భాగస్వాములైన విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. 

ఇప్పటికే పేపర్‌ లీక్‌కు సంబంధించి సీబీఐ క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. దీంతోపాటు బిహార్‌, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వాలు నమోదుచేసిన అభియోగాలను కూడా తమకు బదలాయించాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గుజరాత్‌లోని గోద్రా తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మాల్‌ప్రాక్టీస్‌పై ఓ ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సీబీఐ మొత్తం ఈ వ్యవహారంలో ఆరు కేసులను దర్యాప్తు చేస్తోంది. 

నీట్‌-యూజీ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా మే 5వ తేదీన నిర్వహించింది. దీనికి 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పేపర్‌ బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో లీకైనట్లు ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యలోనే జూన్‌ 4న ఎన్‌టీఏ ఫలితాలు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్రం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని