Rajkot Airport: కూలిన రాజ్‌కోట్‌ విమానాశ్రయ పైకప్పు

భారీవర్షాలకు దిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌-1 పైకప్పు కూలిన 24 గంటల్లోనే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అటువంటి సంఘటనే మరొకటి నమోదైంది. విమానాశ్రయ పైకప్పులో ఓ భాగం శనివారం ఊడిపడిపోయింది.

Published : 30 Jun 2024 05:47 IST

దిల్లీ ఘటన జరిగిన మరుసటి రోజే..

రాజ్‌కోట్‌ (గుజరాత్‌): భారీవర్షాలకు దిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌-1 పైకప్పు కూలిన 24 గంటల్లోనే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అటువంటి సంఘటనే మరొకటి నమోదైంది. విమానాశ్రయ పైకప్పులో ఓ భాగం శనివారం ఊడిపడిపోయింది. ఈ సందర్భంగా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మరోవైపు జబల్‌పుర్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గుజరాత్‌లో గత కొన్నిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో పెద్దఎత్తున నీరు నిలిచింది. ఈ క్రమంలో టెర్మినల్‌ వెలుపల ప్రయాణికుల రాకపోకల కోసం ఏర్పాటుచేసిన పెద్ద వస్త్ర గుడారంలో కొంతభాగం చిరిగి కింద పడిపోయింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వరుస సంఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్టును గతేడాదే ప్రధాని మోదీ ప్రారంభించారని, అప్పుడే పైకప్పు కూలిపోయిందని గుజరాత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శక్తిసింగ్‌ గోహిల్‌ దుయ్యబట్టారు.

నెహ్రూను నిందించొద్దు ప్లీజ్‌ : భాజపా వ్యంగ్యం

కాంగ్రెస్‌ విమర్శలకు భాజపా ఐటీ విభాగం చీఫ్‌ అమిత్‌ మాలవీయ ‘ఎక్స్‌’ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. ‘‘భారీవర్షం, ఈదురుగాలుల కారణంగా రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్టులోని క్లాత్‌ టెంటు చిరిగిపోయింది. అంతేగానీ.. కట్టడం కూలినట్లు కాదు. ఈ ఘటనకు మనం మాజీ ప్రధాని నెహ్రూను నిందించొద్దు. ఎందుకంటే ఆయన ప్రజలకు అవసరమైన స్థాయిలో విమానాశ్రయాలను నిర్మించలేదు’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు