Modi-Rahul Gandhi: ‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా

కాంగ్రెస్ (Congress), విపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శలకు భాజపా (BJP) వీడియోల రూపంలో కౌంటర్ వచ్చింది. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది.

Published : 03 Jul 2024 13:52 IST

దిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi), ఇతర విపక్ష నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం ప్రధాని మోదీ (Modi) ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య ప్రసంగాన్ని కొనసాగించారు. ఈనేపథ్యంలో మోదీ, రాహుల్ లోక్‌సభలో వ్యవహరించిన తీరును చూపిస్తూ భాజపా కొన్ని దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. వీటిని చూస్తే నియంతలా ప్రవర్తించేది ఎవరో తెలుస్తుందని వ్యాఖ్యానించింది.

‘‘రెండు విరుద్ధమైన దృశ్యాలివి. మొదటి వీడియోలో.. సభలో నిబంధనలు ఉల్లంఘించాలని, వెల్‌వైపు దూసుకెళ్లాలని, ప్రధాని ప్రసంగానికి ఆటంకం కలిగించాలని రాహుల్‌ ఎంపీలకు సూచిస్తున్నారు. మరోవైపు  ఇంకో వీడియోలో తనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఎంపీకి ప్రధాని మోదీ తాగేందుకు నీరు అందించారు. ఇక్కడ నియంత ఎవరు? అసలు రాహుల్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష నేత (LOP) నేతగా ఉండే అర్హత ఉందా..?’’ అని భాజపా నేత షెహజాద్ పూనావాలా విమర్శించారు. ఆయన షేర్ చేసిన ఒక వీడియోలో విపక్ష ఎంపీలకు రాహుల్ ఏవో సూచనలు చేయడం కనిపిస్తోంది. ఇంకోదాంట్లో ఒక ఎంపీకి మోదీ నీటి గ్లాసు అందించగా.. సదరు నేత సున్నితంగా తిరస్కరించారు. కానీ పక్కనే ఉన్న మరో విపక్ష ఎంపీ మాత్రం ఆ గ్లాసు తీసుకొని, మంచినీళ్లు తాగారు.

సోమవారం లోక్‌సభలో రాహుల్ చేసిన ప్రసంగంపై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయనది పిల్ల చేష్ట అని, వంద సీట్లు గెలుచుకోకపోయినా, తమపై గెలిచినట్లు చూపించుకోవాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఓటమి చవిచూడాల్సి వచ్చినందుకు కొందరు పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. వారు ఆత్మవిమర్శ చేసుకోకుండా, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు