Lok Sabha Speaker: 50ఏళ్లలో తొలిసారి స్పీకర్‌ పదవికి ఎన్నిక.. అభ్యర్థిని నిలబెట్టిన ఇండియా కూటమి

Lok Sabha Speaker: స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుంది. డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీగా అభ్యర్థిని నిలబెట్టింది.

Updated : 25 Jun 2024 15:38 IST

దిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్‌ (Lok Sabha Speaker) ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే (NDA) ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీపడుతోంది. దాదాపు 50ఏళ్ల తర్వాత స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగనుండటం మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. ఈ స్థానం కోసం ఎన్డీయే తరఫున ఓం బిర్లా (Om Birla) నామినేషన్‌ వేయగా.. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ ఎంపీ కె.సురేశ్‌ (K. Suresh) బరిలో నిలిచారు.

వాస్తవానికి సభాపతి పదవిని అధికార పక్షం, ఉప సభాపతి పదవిని విపక్షం (INDIA Alliance) చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా.. గత హయాంలో డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి ఉప సభాపతి పదవికి పట్టుబట్టాయి. స్పీకర్‌ పదవి అధికార పక్షం తీసుకుంటే.. డిప్యూటీ స్థానాన్ని (Depity Speaker Post) తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే సభాపతి పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి.

ఈ క్రమంలోనే కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను భాజపా రంగంలోకి దించింది. ఈ ఉదయం నుంచి ఆయన మల్లికార్జున్‌ ఖర్గే, ఎంకే స్టాలిన్‌ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్‌ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ.. ఉప సభాపతి పదవి కావాలన్న డిమాండ్‌ మళ్లీ ముందుంచాయి. కానీ, దీనికి ఎన్డీయే సర్కారు సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్‌ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్‌ పదవికి ఎన్నిక అనివార్యమైంది. బుధవారం (జూన్‌ 26) ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.

1925 - 1946 మధ్య ఆరు సార్లు..

స్వాతంత్య్రానికి పూర్వం.. 1925 ఆగస్టు 24న అప్పటి ‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’కి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంటుగా మారింది. ఆ ఎన్నికల్లో టి.రంగాచారియార్‌పై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్‌భాయ్‌ జె.పటేల్‌ స్పీకర్‌గా నెగ్గారు. కేవలం రెండు ఓట్ల (58-56) తేడాతో విజయం సాధించారు. 1925 - 1946 మధ్య ఆరుసార్లు సభాపతి పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చిట్టచివరిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్‌ నేత జి.వి.మౌలాంకర్‌.. ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా స్పీకర్‌గా కొన్నాళ్లు కొనసాగారు.

స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి..

1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. అదే సంవత్సరం స్పీకర్‌ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శంకర్‌ శాంతారామ్‌పై మౌలాంకర్‌ విజయం సాధించారు. ఆ ఎన్నికలో మౌలాంకర్‌కు 394 ఓట్లు రాగా.. శాంతారామ్‌కు 55 ఓట్లు దక్కాయి. ఇక, 1976లో (ఎమర్జెన్సీ సమయంలో) బలిరామ్‌ భగత్, జగన్నాథ్‌ రావు పోటీ పడగా.. 344 ఓట్లతో భగత్‌ విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, బలరాం జాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు