Emergency: 50వ ఏడాదిలోకి ‘ఎమర్జెన్సీ’

దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తికానుంది. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే.

Published : 25 Jun 2024 05:54 IST

నేడు భాజపా నిరసనలు 

దిల్లీ: దేశంలో అత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తికానుంది. ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం సంచలనాత్మకం కావడంతోపాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ సోమవారం కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రపతి దేశవ్యాప్త ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు 1975 జూన్‌ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పేదలకు లబ్ధి కలిగించే పురోగమన చర్యలను తాను ప్రారంభించినప్పటి నుంచి బలమైన కుట్ర మొదలైందని ఇందిర ఆరోపించారు. ఆమెను తొలగించేందుకు దేశవ్యాప్త ఉద్యమానికి జయప్రకాశ్‌ నారాయణ్‌ (జేపీ) పిలుపునిచ్చారు. విపక్షనేతలైన జేపీ, ఆడ్వాణీ, వాజ్‌పేయీ, మొరార్జీ దేశాయ్‌ సహా అనేకమందిని ఎమర్జెన్సీ సమయంలో ఖైదు చేశారు. పత్రికాస్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ.. ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి, 21న అత్యయిక పరిస్థితిని ఎత్తివేశారు. 

‘ఎమర్జెన్సీ చీకటిరోజులు’ పేరుతో తమ జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగే కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా ప్రసంగిస్తారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి, ఎంపీ అనిల్‌ బలూనీ ఒక ప్రకటనలో తెలిపారు. దేశ దేదీప్యమాన ప్రజాస్వామ్యంలో మరపురాని చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీ నిలిచిపోతుందన్నారు. ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ కాంగ్రెస్‌ కాలరాసిన తీరు తలచుకుంటే ఇప్పటికీ భయం కలుగుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని