Salman Khan: జిగాన గన్స్‌.. రూ.25 లక్షల కాంట్రాక్ట్‌..: కారులోనే సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర

సల్మాన్‌ ఖాన్‌ను కూడా సింగర్‌ సిద్ధూ మూసేవాలా తరహాలోనే హత్య చేసేందుకు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కుట్ర పన్నింది. జిగాన తుపాకులు, 70 మందితో కూడిన నెట్‌వర్క్‌, పాక్‌ ఆయుధ డీలర్లు, స్థానిక కిరాయి గ్యాంగ్‌లతో ఓ నెట్‌వర్క్‌ ఈ బాలీవుడ్‌ హీరోపై దాడి కుట్రలో భాగమైనట్లు తేలింది.  

Updated : 02 Jul 2024 20:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ హత్యకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పన్నిన భారీ కుట్ర దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్‌లో సల్మాన్‌ఖాన్‌ ఇంటిపై కాల్పుల కేసు దర్యాప్తులో ఒళ్లు జలదరించే వాస్తవాలు బయటపడ్డాయి. నవీ ముంబయి పోలీసులు ఈమేరకు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. సల్మాన్‌ హత్యకు ఆ గ్యాంగ్‌ పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తోంది. అచ్చంగా పంజాబీ సింగర్‌ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే కారులో హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం మైనర్లను షార్పు షూటర్లుగా వాడేందుకు ఈ గ్యాంగ్‌ ఏర్పాట్లు చేసింది. సినిమా షూటింగ్‌లు లేదా పన్వేల్‌ ఫామ్‌హౌస్‌కు సల్మాన్‌ రాకపోకలు సాగిస్తున్న వేళ ఈ కుట్రను అమలుచేయాలనుకొన్నట్లు తెలిపారు. ఇక హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు కూడా ఇచ్చింది. 2023 ఆగస్టు నుంచి 2024 ఏప్రిల్‌ మధ్య రూపొందించింది. తుర్కియే (టర్కీ) నుంచి జిగాన పిస్టోళ్లను తెప్పించేందుకు పథకం సిద్ధం చేసింది. 

ఏమిటీ జిగాన తుపాకులు..

గతంలో సింగర్‌ సిద్ధూ మూసేవాలా, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ హత్యల్లో ఈ తుపాకులు వాడారు. తుర్కియేకు చెందిన ‘టిసాస్‌’ కంపెనీ ఈ సెమీ-ఆటోమేటిక్‌ ఆయుధాన్ని తయారుచేస్తోంది. అక్కడ పాలిమర్‌ ఫ్రేమ్‌తో తయారైన తొలి పిస్తోల్‌ ఇదే. ఈ ఆయుధం ఖరీదు ఒక్కోటీ రూ.ఆరు లక్షలకు పైనే. అక్కడి సైన్యం, స్పెషల్‌ ఫోర్సెస్‌, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు వీటిని వాడుతున్నాయి. దీనిలో బరస్ట్‌మోడ్‌తో అత్యంత వేగంగా కాల్పులు జరపవచ్చు. భారత్‌లో వీటిపై నిషేధం ఉంది.

మరోవైపు పాకిస్థాన్‌ నుంచి వీటిని దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ తుర్కియే తుపాకులకు పాకిస్థాన్‌ నకళ్లు తయారుచేస్తోంది. ఇవి అసలు తుపాకులంత నాణ్యతతో ఉన్నా.. ధరలో మాత్రం చౌకగా లభిస్తుంటాయి. పాకిస్థాన్‌లో ‘గన్‌ వ్యాలీ’గా పేరున్న ‘దర్రా ఆదమ్‌ ఖేల్‌’  అనే ప్రాంతంలో దాదాపు 2,000 ఆయుధాల షాపులు ఉన్నాయి. జిగాన తుపాకులు అత్యంత కచ్చితత్వంతో పనిచేయడంతోపాటు.. మిగిలిన అధునాతన గన్స్‌ కంటే తక్కువ ధరలో లభిస్తాయి.  వీటితోపాటు ఈ కుట్ర అమలుకు ఏకే-47,ఏకే92ఎస్‌, ఎం16 రైఫిల్స్‌ను పాక్‌ నుంచి సరిహద్దులు దాటించి తెచ్చేందుకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ ఏర్పాట్లు చేసింది. 

70 మందితో భారీ నెట్‌వర్క్‌..

ఈ మొత్తం కుట్రను అమలుచేయడానికి లారెన్స్‌ బిష్ణోయ్‌-సంపత్‌ నెహ్రా గ్యాంగులకు చెందిన 60-70 మందితో ఓ భారీ నెట్‌వర్క్‌ ఏర్పాటుచేశారు. వీరు సల్మాన్‌ కదలికలపై నిఘా పెట్టారు. ముంబయిలోని అపార్ట్‌మెంట్‌, పన్వేలీ ఫామ్‌హౌస్‌ వంటిచోట్ల వీరు ఓ కన్నేసి ఉంచారు. వీటితోపాటు థానే, పుణె, రాయ్‌ఘడ్‌, గుజరాత్‌ల్లో రెక్కీలు నిర్వహించారు. ఇక హత్య పథకాన్ని అమలుచేసేందుకు 18ఏళ్ల లోపు మైనర్లను సిద్ధం చేసినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే వారు గోల్డీబ్రార్‌, అన్మోల్‌ బిష్ణోయ్‌ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైంది. 

లోతైన దర్యాప్తుతో వెల్లడి..

పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం, నిందితుల మొబైల్‌ ఫోన్ల సమాచార విశ్లేషణ. వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటుచేసిన విధానం, టవర్‌ లొకేషన్స్‌, ప్రత్యక్ష సాక్షులతో ఆడియో, వీడియో కాల్స్‌ వంటి వాటి ఆధారంగా దర్యాప్తు బృందం ఓ అవగాహనకు రాగలిగింది.  ఛార్జిషీట్లో ధనుంజయ్‌ తాప్‌సింగ్‌, అజేయ్‌ కశ్యప్‌, గౌతమ్‌ వినోద్‌ భాటియా, వాస్పి మహమ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ చైనా, రిజ్వాన్‌ హసన్‌ అలియాస్‌ జావెద్ ఖాన్‌, దీపక్‌ హవా సింగ్‌ పేర్లను ప్రస్తావించింది.  

ఇన్‌స్పెక్టర్‌కు ఇంటెలిజెన్స్‌ టిప్‌తో బహిర్గతం..

పన్వేల్‌ ఇన్‌స్పెక్టర్‌ నితిన్‌ ఠాక్రేకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ ఇంటెలిజెన్స్‌ టిప్‌ వచ్చింది. లారెన్స్‌ బిష్ణోయ్‌ తన గ్యాంగ్‌ సభ్యులకు సల్మాన్‌ను హత్య చేసేందుకు రూ.25 లక్షలు ఆఫర్‌ చేసినట్లు దీనిలో తెలిసింది. ఈ గ్యాంగ్‌ సభ్యలు దాదాపు 15-16 మందితో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటుచేసుకొన్నారు. హత్యపై  వారు కమ్యూనికేట్‌ చేసుకొంటున్నట్లు గుర్తించారు. ఈ గ్రూపులో అన్మోల్‌ బిష్ణోయ్‌, గోల్డీబ్రార్‌, అజేయ్‌ కశ్యప్‌, వినోద్‌ భాటియా, వాస్పి మహమ్మద్‌ ఖాన్‌, రిజ్వాన్‌ హసన్‌ ఉన్నట్లు కనుగొన్నారు. 

పాకిస్థాన్‌కు చెందిన సుఖా షూటర్‌, డోగ్రా అనే ఇద్దరు ఆయుధ సప్లయర్లు ఈ కుట్ర కోసం పనిచేసినట్లు అధికారులు ప్రస్తావించారు. వీరు ఏకే-47, ఎం16 రైఫిల్స్‌ను గ్యాంగ్‌కు అందించేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అజయ్‌ కశ్యప్‌ కుట్రకు కోఆర్డినేటర్‌..

ఏప్రిల్‌లో సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరపడానికి ముందే పన్వేల్‌లో నలుగురు మనుషులు వేర్వేరు ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నట్లు నవీ ముంబయి సర్కిల్‌ డీసీపీ వివేక్‌ పన్సారే పేర్కొన్నారు. మొత్తం 25 మంది వరకు ప్లానింగ్‌లో భాగమైనట్లు పేర్కొన్నారు. వీరందరినీ అజయ్‌ కశ్యప్‌ సమన్వయం చేసినట్లు వెల్లడించారు. ఈ కుట్ర అమలుకు వాడే ఆయుధాల సమాచారం కూడా ఇతనికి తెలుసన్నారు. ఈ ముఠా ఎస్కేప్‌ ప్లానింగ్‌ కూడా సిద్ధం చేసినట్లు డీసీపీ వెల్లడించారు. అరెస్టు చేసిన నిందితుల మొబైల్‌ ఫోన్లలో సల్మాన్‌పై ఎలా దాడి చేయాలో సూచనలు చెబుతున్న వీడియోలు కూడా పోలీసులకు లభించాయి. ఏకే-47లతో పాటు.. ఇతర ఆయుధాలు కూడా దాడికి వాడాలని వారికి సూచించారు. పాక్‌లోని ఆయుధ డీలర్లతో తాను టచ్‌లో ఉన్నట్లు అజేయ్‌ ఇంటరాగేషన్‌లో అంగీకరించాడు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని