Sharad Pawar: ‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్‌ పవార్‌

దివంగత ప్రధాని ఇందిరాగాంధీ నాడు దేశంలో విధించిన ‘ఎమర్జెన్సీ’పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ మండిపడ్డారు.

Published : 29 Jun 2024 14:29 IST

ముంబయి: ‘ఎమర్జెన్సీ (Emergency)’ అంశంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా (Om Birla) చేసిన వ్యాఖ్యలపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) స్పందించారు. స్థాయికి తగినట్లు ఆయన సభలో మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు. శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న పవార్‌.. స్పీకర్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘లోక్‌సభ స్పీకర్‌ పదవిలో ఉన్న ఓం బిర్లా అసందర్భంగా ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించారు. ఇది ఆయన స్థాయికి ఏమాత్రం తగదు. ఆ చీకటి అధ్యాయం ముగిసి 50 ఏళ్లు కావొస్తోంది. ప్రస్తుతం ఈ అంశాన్ని తెర మీదకు ఎందుకు తీసుకొస్తున్నారు? రాజకీయంగా ఇలాంటి ప్రకటనలు చేయడం స్పీకర్‌ విధుల్లో భాగమా? ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని శరద్‌ పవార్‌ ప్రశ్నించారు.

ఆయన అందుకు అర్హుడు.. 

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీని ఎన్నుకోవడాన్ని పవార్‌ స్వాగతించారు. రాహుల్‌ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలరంటూ విశ్వాసం వ్యక్తంచేశారు. ‘‘పార్లమెంట్‌లో భాజపాకు మెజారిటీ లేదనడంలో ఏ సందేహం లేదు. బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు నీతీశ్‌కుమార్‌, చంద్రబాబు మద్దతు లేకుంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయేవారు. దీన్ని మోదీ సర్కార్‌ అంగీకరించకపోయినా.. దేశ ప్రజలకు వాస్తవమేంటో స్పష్టం అవుతోంది’’ అని ఆరోపించారు. 

మహిళలూ.. భర్తలతో తాగుడు ఇలా మాన్పించండి: మంత్రి టిప్‌ వైరల్‌

రాష్ట్ర బడ్జెట్‌ ఓ వ్యూహం.. 

కాగా.. మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంపై శరద్‌ పవార్‌ తీవ్ర విమర్శలు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రమేనని అన్నారు. ‘‘ఇచ్చిన వాగ్దానాలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవు. మన దగ్గర రూ.70 ఉన్నప్పుడు రూ.100 ఎలా ఖర్చు చేయగలమో ఆలోచించండి? అధికారం చేజిక్కించుకునేందుకు ఇదొక వ్యూహం మాత్రమే. ఈ బడ్జెట్‌ను  స్వీకరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు’’ అని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని