Hathras Stampede: ‘రద్దీకి అదే కారణం..! భోలే బాబా త్వరలోనే ప్రజల ముందుకు..’

భోలే బాబా (Bhole Baba) త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఆయన తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ వెల్లడించారు.

Published : 05 Jul 2024 23:10 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాట కేసులో (Hathras Stampede) భోలే బాబా (Bhole Baba) ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. అయితే.. ఆయన త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని బాబా తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ వెల్లడించారు. కేసు విచారణకు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. 121 మంది మృతికి కారణమైన జులై 2నాటి తొక్కిసలాట ఘటనానంతరం భోలే బాబా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దేవ్‌ప్రకాశ్‌ కూడా పరారీలో ఉన్నాడు. అయితే, తొక్కిసలాటలో అతడు గాయపడ్డాడని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని.. కోలుకున్న వెంటనే సిట్‌ ముందుకు వస్తాడని న్యాయవాది చెప్పారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌వరకు ఎటువంటి సత్సంగ్‌లు నిర్వహించలేదని, అందుకే ఇటీవలి కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు పోటెత్తారని న్యాయవాది తెలిపారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల అవసరాలను ట్రస్టు చూసుకుంటుందని చెప్పారు. ‘‘జిల్లాల వారీగా బాధితుల వివరాలు ట్రస్టు వద్ద ఉన్నాయి. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాల విద్య, ఆరోగ్యం, పెళ్లి ఖర్చులను నారాయణ్‌ సాకార్‌ హరి ట్రస్టు భరిస్తుంది’’ అని వివరించారు.

24 ఆశ్రమాలు, లగ్జరీ కార్లు.. భోలే బాబాకు ₹100 కోట్ల ఆస్తులు!

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. మంగళవారం నాడు తొక్కిసలాట జరిగిన సమయంలో వేదిక లోపల వీరే జనాన్ని నియంత్రించే బాధ్యతలను చేపట్టారు. దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డును అందజేస్తామని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. భోలే బాబాను కేసులో నిందితుడిగా చేర్చలేదు. సత్సంగ్‌కు 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోగా.. 2.5 లక్షల మంది హాజరైనట్లు అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని