Supreme Court: బెయిల్‌ పిటిషన్ల ‘వాయిదా’లపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

బెయిల్‌ పిటిషన్లను అనవసరంగా వాయిదా వేయకూడదని దిల్లీ హైకోర్టును ఉద్దేశిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) పేర్కొంది.

Published : 25 Jun 2024 19:10 IST

దిల్లీ: బెయిల్‌ అంశాలకు సంబంధించి భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వాటిని అనవసరంగా వాయిదా వేయకూడదని దిల్లీ హైకోర్టును ఉద్దేశిస్తూ పేర్కొంది. మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ బెయిల్‌ విజ్ఞప్తిపై తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించడం అసాధారణంగా పరిగణించిన సుప్రీం కోర్టు.. మరో కేసులోనూ దిల్లీ ఉన్నత న్యాయస్థానం తీరుపై ఇలా వ్యాఖ్యానించింది.

స్పీకర్‌ ఎన్నిక ఎలా జరుగుతుంది? ఆ పదవికి ఎందుకంత ప్రాధాన్యం?

తన బెయిల్‌ పిటిషన్‌ను విచారించకుండా దిల్లీ హైకోర్టు సుదీర్ఘకాలం వాయిదా వేయడంపై మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిని పరిశీలించిన జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీలతో కూడిన ధర్మాసనం.. ‘‘బెయిల్‌ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయకూడదని చెప్పనవసరం లేదు. అందుకే తదుపరి విచారణ తేదీన హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొంది. జులై 9న హైకోర్టు విచారణ చేపట్టనుంది.

మరోవైపు, అరవింద్‌ కేజ్రీవాల్‌కు సంబంధించి ట్రయల్‌ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై దిల్లీ హైకోర్టు మధ్యంతర నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వటంపైనా సుప్రీంకోర్టు ఇటీవల ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచడాన్ని ‘అసాధారణ నిర్ణయం’గా అభిప్రాయపడింది. కేజ్రీవాల్‌ బెయిల్‌పై స్టే ఇస్తూ హైకోర్టు నిర్ణయం వెలువడిన నేపథ్యంలో జూన్ 26న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని