Ayodhya: అయోధ్యలో మరో చరిత్రాత్మక ఘట్టం.. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం

Ayodhya: ఇక నుంచి సామాన్య భక్తులందరూ బాలరాముడిని దర్శించుకోవచ్చు. సామాన్యులను స్వామివారి దర్శనానికి మంగళవారం నుంచి అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ముందే ప్రకటించింది.

Updated : 23 Jan 2024 12:50 IST

అయోధ్య: అయోధ్య రామమందిర (Ayodhya Ram Mandir) తలుపులు సామాన్య భక్తులకు తెరుచుకోవటంతో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. మంగళవారం ఉదయం నుంచి స్వామివారి దర్శన భాగ్యానికి సామాన్యులను అనుమతించారు. సోమవారం ఘనంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ (Pran Pratishtha) తర్వాత కేవలం అతిథులు మాత్రమే శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఇక నుంచి సామాన్య భక్తులందరూ బాలరాముడిని దర్శించుకోవచ్చు.

సామాన్యులను స్వామివారి దర్శననానికి మంగళవారం నుంచి అనుమతిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ముందే ప్రకటించింది. దీంతో భక్తులు సోమవారం అర్ధరాత్రి నుంచే మందిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున బలగాలను మోహరించింది. దర్శనం, హారతి వేళల వివరాలను ట్రస్ట్‌ తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్‌ ఇస్తారు కానీ అవి పరిమితంగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో కానీ, ప్రత్యక్షంగా ఆలయం వద్ద కానీ పాస్‌ తీసుకున్న వాళ్లకే ఆ సమయంలో అనుమతిస్తారు. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది.

నవశకపు నిర్మాణ అద్భుతం!

దర్శన వేళలు : ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు

జాగరణ హారతి : ఉదయం 6.30 గంటలకు (ఒక రోజు ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది)

సంధ్యా హారతి: రాత్రి 7.30 గంటలకు (అందుబాటును బట్టి అదే రోజు బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది)

బాలరాముడి దర్శనం/హారతి పాస్‌లకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఇలా..

  • శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
  • మీ మొబైల్‌ నంబరుతో సైన్‌ ఇన్‌ అయి ఓటీపీ ఎంటర్‌ చేస్తే మీ రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది.
  • ఒకసారి లాగిన్‌ అయిన తర్వాత.. ‘మై ప్రొఫైల్‌’ సెక్షన్‌లోకి వెళ్లి మీ గుర్తింపు వివరాలు, చిరునామా వంటివి నమోదు చేయాలి.
  • ఆ తర్వాత హారతి/దర్శనం టైమ్‌ స్లాట్లను ఎంచుకుని.. పాస్‌ కోసం బుక్‌ చేసుకోవాలి.
  • ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్‌లో మీ పాస్‌లు తీసుకుని దర్శనానికి వెళ్లొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని