Arvind Kejriwal: సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్‌

మనీలాండరింగ్‌తో ముడిపడిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి,  ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి న్యాయస్థానం బుధవారం అనుమతించింది.

Published : 27 Jun 2024 05:44 IST

మూడు రోజుల వరకు అనుమతి
ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశం
కోర్టుకు హాజరైన కేజ్రీవాల్‌

దిల్లీ: మనీలాండరింగ్‌తో ముడిపడిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి,  ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి న్యాయస్థానం బుధవారం అనుమతించింది. దీనిపై ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. తిహాడ్‌ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్‌ను తీసుకొచ్చి బుధవారం ఉదయం రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఆయనను అయిదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి చేయగా జడ్జి తొలుత నిర్ణయాన్ని రిజర్వు చేశారు. ఆ తర్వాత మూడు రోజుల కస్టడీకి అనుమతించారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి తిహాడ్‌ జైలులో ఉంచిన విషయం తెలిసిందే.

నేను నిర్దోషిని: కేజ్రీవాల్‌

కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్‌ స్వయంగా వాదనలు వినిపిస్తూ తాను నిర్దోషినని తెలిపారు. మద్యం కుంభకోణం తప్పిదమంతా మనీశ్‌ సిసోదియాదేనని తాను తెలిపినట్లుగా మీడియాలో సీబీఐ వర్గాలను ఉటంకిస్తూ ప్రధాన శీర్షికలతో కథనాలు వచ్చాయని, తాను అలాంటి వాంగ్మూలం ఏదీ ఇవ్వలేదని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తమను అప్రతిష్ఠపాల్జేయాలన్న కుట్రను మీడియా ద్వారా సీబీఐ అమలుచేస్తోందని ఆరోపించారు. కేజ్రీవాల్‌ వాదనలను సీబీఐ తోసిపుచ్చింది.  

మద్యం కుంభకోణంలోని విస్తృతమైన కుట్రను ఛేదించడానికి గాను కేజ్రీవాల్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. కేజ్రీవాల్‌ను ఇప్పుడే ఎందుకు అరెస్టు చేస్తున్నారని దర్యాప్తు సంస్థను జడ్జి ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు విషయాన్ని న్యాయస్థానం పరిశీలించిందని, అందువల్ల ఇప్పటి వరకు సంయమనం పాటించినట్లు సీబీఐ తరఫు న్యాయవాది బదులిచ్చారు. అధికార వ్యవస్థల దుర్వినియోగానికి మద్యం కేసు ఓ ప్రబల నిదర్శనమని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. 

సుప్రీంలో పిటిషన్‌ వెనక్కి..

ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై దిల్లీ హైకోర్టు మధ్యంతర స్టేను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను కేజ్రీవాల్‌ బుధవారం ఉపసంహరించుకున్నారు. బెయిల్‌ అమలు నిలుపుదలపై హైకోర్టు మంగళవారం పూర్తిస్థాయి ఆదేశాలు ఇవ్వడం, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి న్యాయస్థానానికి తెలిపారు. జస్టిస్‌ మనోజ్‌ మిశ్ర, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌తో కూడిన సెలవుకాల ధర్మాసనం అందుకు అనుమతించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు