Gen Dwivedi: భద్రతా పరమైన సవాళ్లు స్వీకరించడానికి ఆర్మీ సిద్ధంగా ఉంది: జనరల్‌ ద్వివేది.

దేశానికి ఎదురయ్యే ఎటువంటి భద్రతా సవాళ్లనైనా ఎదుర్కోవడానికి  భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ద్వివేది పేర్కొన్నారు. 

Published : 01 Jul 2024 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత సైన్యం (Indian Army) ఎటువంటి భద్రతా పరమైన సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉందని ఆర్మీ నూతన చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది (Gen Dwivedi) పేర్కొన్నారు. తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దు వివాదాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్మీకి ఆయన నిన్న చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. తాను పదాతి దళం, వాయుసేన, నేవీతో కలిసి సినర్జీని పెంచుతానని వెల్లడించారు. 

నేడు ఆర్మీ చీఫ్‌ రైసినా హిల్స్‌లోని సౌత్‌ బ్లాక్‌లో గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘సైన్యం ప్రత్యేకమైన ఆపరేషనల్ సవాళ్లను ఎదుర్కొంటోంది. పలు ముప్పులను ఢీకొనడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు అప్పజెప్పిన బాధ్యతలపై పూర్తి అవగాహనతో ఉన్నాను. దేశ ఆర్మీకి నాయకత్వం వహించడం గర్వకారణం’’ అని పేర్కొన్నారు. 

సైనిక దళాల్లో దేశీయ ఆయుధాలను ప్రవేశపెట్టేందుకు పూర్తి సానుకూలతతో  ఉన్నట్లు వెల్లడించారు. భౌగోళిక రాజకీయాలు, సాంకేతికత వేగంగా మారిపోతున్నాయని ద్వివేది అభిప్రాయపడ్డారు. వికసిత్‌భారత్‌-2047 విజన్‌ సాధించేందుకు వీలుగా జాతినిర్మాణం కోసం పనిచేస్తామన్నారు. భారత్‌ ప్రయోజనాలు కాపాడేందుకు కృషి చేస్తామన్నారు. ఇక సిబ్బంది, వారి కుటుంబాలకు పూర్తి మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.

జనరల్‌ ఉపేంద్ర ద్వివేది 1964 జులై 1న జన్మించారు. 1984 డిసెంబర్‌ 15న జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌ రెజిమెంటులో చేరి, వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. భారతసైన్యంలో వైస్‌ చీఫ్‌గా ఉంటూ.. ఇప్పుడు 13 లక్షల బలమైన సైనికశక్తి గల ఆర్మీకి 30వ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల వెంబడి విస్తృతమైన ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీకి ఉన్నట్లు భారత ఆర్మీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని