Bridges Collapse: ఆ రాష్ట్రంలో కుప్పకూలుతున్న వంతెనలు.. 15 రోజుల్లో ఏడు!

భారీ వర్షాల నేపథ్యంలో బిహార్‌లో గడిచిన 15 రోజుల్లో ఏడు బ్రిడ్జిలు కూలిపోయాయి.

Updated : 03 Jul 2024 17:43 IST

(అరారియా జిల్లాలో ఇటీవల కూలిన వంతెన)

పట్నా: బిహార్‌లో భారీ వర్షాలకు వంతెనలు కుప్పకూలుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా గండక్‌ నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలిపోయింది. దీంతో మహరాజ్‌గంజ్‌ నుంచి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 15 రోజుల వ్యవధిలోనే ఏడు బ్రిడ్జిలు కూలిపోవడం గమనార్హం.

సివాన్‌ జిల్లా డియోరియా ప్రాంతంలో గండక్ నదిపై చిన్న వంతెన ఉంది. దీనికి కొన్ని రోజులుగా మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కొంతభాగం కూలిపోయింది. పది రోజుల క్రితం ఇదే జిల్లాలో ఓ వంతెన కూలిపోగా.. ఇది రెండోది. ఈ బ్రిడ్జిని 1982-83 మధ్యకాలంలో నిర్మించారని, ప్రమాదానికి కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.

ఇటీవల కిషన్‌గంజ్‌ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన కుంగిపోయింది. దీంతో బహదుర్‌గంజ్‌, దిఘాల్‌బ్యాంక్‌ బ్లాక్‌ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతకుముందు తూర్పు చంపారన్‌, సివాన్‌, అరారియా జిల్లాల్లో వంతెన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇలా పదిహేను రోజుల వ్యవధిలోనే వరుసగా ఏడు ప్రమాదాలు జరగడంపై రాష్ర్టవ్యాప్తంగా వంతెనల నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు