Amritpal Singh: జులై 5న ఎంపీగా ప్రమాణం చేయనున్న అమృత్‌పాల్ సింగ్‌

ఖలిస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) జులై 5 లోక్‌సభ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మరో ఎంపీ సరభ్‌జీత్‌ సింగ్ ఖల్సా వెల్లడించారు. 

Published : 03 Jul 2024 16:58 IST

దిల్లీ: ఖలిస్థానీ నేత, వారిస్‌ పంజాబ్‌ దే నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని డిబ్రూగఢ్‌లో జైల్లో ఉన్న అతడు.. జులై 5న లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఫరీద్‌కోట ఎంపీ సరభ్‌జీత్‌ సింగ్ ఖల్సా మీడియాకు వెల్లడించారు.

అమృత్‌ పాల్ సింగ్‌ ప్రమాణస్వీకారం గురించి తాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో మాట్లాడానని ఖల్సా చెప్పారు. జులై 5న స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం ఉండనుందని తెలిపారు. దీనికి సంబంధించి అతడికి ఐదవ తేదీ నుంచి నాలుగురోజులకు పేరోల్‌ లభించినట్లు చెప్పారు. అమృత్‌ పాల్‌.. పంజాబ్‌ (Punjab)లోని ఖడూర్‌ సాహిబ్‌ స్థానం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అదే రోజు ఉగ్రనిధుల కేసు (terror-funding case) నిందితుడు, బారాముల్లా ఎంపీ ఇంజినీర్‌ రషీద్‌ (Engineer Rashid) ప్రమాణ స్వీకారం కూడా ఉండనుంది.

అమృత్‌సర్‌ జిల్లా అజ్‌నాలా పోలీసులపై దాడి కేసులో అమృత్‌పాల్‌ పేరు దేశంలో మార్మోగింది. అతడు చాలాకాలం దుబాయిలో ఉన్నాడు. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్‌సిద్ధూ మరణంతో అమృత్‌పాల్‌ ఆ సంస్థకు తానే నాయకుడినని ప్రకటించుకున్నాడు. నాటినుంచి ఖలిస్థానీ కార్యకలాపాలకు ఏకంగా పంజాబ్‌నే స్థావరంగా ఎంచుకున్నాడు. అజ్‌నాలా ఘటన తర్వాత దాదాపు నెల రోజులు అజ్ఞాతంలో గడిపాడు. చివరికి జర్నైల్‌ సింగ్‌ గ్రామమైన రోడెవాల్‌లోని గురుద్వారాలో అతడిని అరెస్టు చేసి డిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని