Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రం ప్రారంభం

దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని అమర్‌నాథ్‌ గుహాలయాన్ని సందర్శించేందుకు వచ్చే యాత్రికుల కోసం గురువారం నుంచి స్పాట్‌ రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మొదలైంది.

Published : 28 Jun 2024 05:52 IST

తొలిరోజు 358 మంది పేర్లు నమోదు
బేస్‌క్యాంప్‌నకు చేరుకున్న 1600 మంది యాత్రికులు

జమ్మూలోని పురానీ మండి వద్ద రామమందిరం కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన అమర్‌నాథ్‌ స్పాట్‌ రిజిస్ట్రేషన్ల కేంద్రం వద్ద వరుసలో వేచిఉన్న సాధువులు

జమ్మూ: దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని అమర్‌నాథ్‌ గుహాలయాన్ని సందర్శించేందుకు వచ్చే యాత్రికుల కోసం గురువారం నుంచి స్పాట్‌ రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మొదలైంది. ఇందుకు జమ్మూలోని పురానీ మండి వద్ద రామమందిరం కాంప్లెక్స్‌లో కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్‌ లేకుండా వచ్చే యాత్రికుల పేర్లను ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేసి యాత్రకు అనుమతిస్తారు. రోజుకు 600 మందికి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. గురువారం 358 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరోపక్క కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సుమారు 1600 మంది యాత్రికులు బేస్‌క్యాంపు భాగవతి-నగర్‌కు చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. వారిలో మహిళలు సహా 800 మంది సాధువులు కూడా ఉన్నారని తెలిపారు. 52 రోజుల పాటు సాగే అమర్‌నాథ్‌ యాత్ర 48 కిలోమీటర్ల దూరం ఉండే అనంతనాగ్‌ జిల్లాలోని నున్‌వాన్‌-పహల్గావ్‌; 14 కిలోమీటర్లు సాగే గండెర్‌బాల్‌లోని బాల్టాల్‌ అనే రెండు మార్గాల్లో సాగుతుంది. జమ్మూలోని భగవతి-నగర్‌ బేస్‌ క్యాంప్, రామ్‌ మందిర్‌ నుంచి అమర్‌నాథ్‌ యాత్రికుల మొదటి బ్యాచ్‌ శుక్రవారం యాత్ర ప్రారంభిస్తుంది. 

భద్రత కట్టుదిట్టం

ఇటీవల జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో వార్షిక అమర్‌నాథ్‌ యాత్ర షెడ్యూల్‌ శనివారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో యాత్ర సాగే మార్గం అంతా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్‌ నిఘానూ వినియోగిస్తున్నట్లు ఓ సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన భద్రతపై గురువారం జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా సమీక్షించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు