Akhilesh Yadav: ప్రతిపక్షాలను గౌరవించండి.. ఓం బిర్లాతో అఖిలేశ్‌

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికైన సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రసంగించారు. అధికార పార్టీ మాదిరిగా ప్రతిపక్షాలను కూడా గౌరవించాలంటూ స్పీకర్‌ను కోరారు. 

Published : 26 Jun 2024 18:52 IST

దిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా భాజపా ఎంపీ ఓం బిర్లా (Om Birla) వరుసగా రెండోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నూతన స్పీకర్‌కు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో పార్లమెంట్‌లో జరిగిన బహిష్కరణలు, ఎంపీల సస్పెన్షన్‌లను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నూతన స్పీకర్‌ను కోరారు.

‘‘18 లోక్‌సభకు ఓం బిర్లా స్పీకర్‌ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎన్నో సార్లు ఎంపీలు సస్పెన్షన్‌లకు గురయ్యారు. బహిష్కరణలు కూడా జరిగాయి. బహిష్కరణ వంటి చర్యలు మళ్లీ జరగవని మేమంతా ఆశిస్తున్నాం. ప్రతిపక్షాలపై మీకు (ఓం బిర్లాను ఉద్దేశిస్తూ) నియంత్రణ ఉంది. అధికార పక్షం విషయంలోనూ అదే మాదిరిగా వ్యవహరిస్తారని భావిస్తున్నాం’’ అని అఖిలేశ్‌ యాదవ్‌ ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు.

తొలి ప్రసంగంలో ‘ఎమర్జెన్సీ’పై స్పీకర్‌ వ్యాఖ్యలు.. మోదీ ఏమన్నారంటే..?

అలా చేస్తే మా మద్దతు మీకే..

‘‘మీరు ప్రజాస్వామ్యం అనే న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. సభలో మీరు తీసుకునే న్యాయమైన నిర్ణయాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీ నేతృత్వంలో అధికార వర్గం మాదిరిగా ప్రతిపక్షాలకు కూడా అదే స్థాయిలో గౌరవం దక్కుతుందని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. సొమ్ములు తీసుకుని ప్రశ్నలు అడిగారనే ఆరోపణలతో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సభ నుంచి బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. కాగా.. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి కె. సురేశ్‌పై ఓం బిర్లా విజయం సాధించారు. దీంతో ఆయన వరుసగా రెండో సారి ఈ పదవిని చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు