Yogi Adityanath: హాథ్రస్‌ తొక్కిసలాటపై జ్యుడీషియల్‌ విచారణ: సీఎం యోగి ప్రకటన

హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటపై జ్యుడీషియల్‌ విచారణ జరపనున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు.

Updated : 03 Jul 2024 17:01 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh)లోని హాథ్రస్‌లో భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశంలో పెనువిషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతి చెందగా.. వీరిలో ఆరుగురు ఇతర రాష్ట్రాల వారు ఉన్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ బుధవారం వెల్లడించారు. ఆరుగురు మృతుల్లో హరియాణా నుంచి నలుగురు, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై విశ్రాంత హైకోర్టు జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ జరుపుతామని ప్రకటించారు. న్యాయ విచారణ కమిటీలో విశ్రాంత అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా భాగంగా ఉంటారని తెలిపారు. ఈ విషాదానికి బాధ్యులెవరో గుర్తించడంతో పాటు, ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకొనేలా నిబంధనలు రూపొందిస్తామని సీఎం తెలిపారు. 

హాథ్రస్‌ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?

హాథ్రస్‌ జిల్లాలో భోలే బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో మంగళవారం జరిగిన భారీ తొక్కిసలాట (Hathras stampede) పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 121 మంది మృతి చెందగా.. గాయాలపాలైనవారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ విషాదం తర్వాత భోలే బాబా పరారీలో ఉన్నారు. అతడి ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

సీబీఐ విచారణకు డిమాండ్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ అలహాబాద్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  గౌరవ్‌ ద్వివేది అనే న్యాయవాది ఈ పిల్‌ దాఖలు చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని.. ఇందుకు జిల్లా అధికారులదే పూర్తి బాధ్యత అని ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయమైన విచారణ జరిగేలా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. అలాగే, ఈ దుర్ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. డీజీపీ, హాథ్రస్‌ డివిజనల్‌ కమిషనర్‌, జిల్లా మెజిస్ట్రేట్‌, ఎస్పీ, ఫులేరా పోలీస్‌స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌వోలను సస్పెండ్‌ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదని కోర్టు వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు