Pavithra Gowda: పోలీసు కస్టడీలో మేకప్‌ వేసుకుని.. లిప్‌స్టిక్‌ రాసుకున్న పవిత్రా గౌడ

Pavithra Gowda: హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటి పవిత్రా గౌడ పోలీసు కస్టడీలో మేకప్‌ వేసుకోవడం వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి.

Published : 27 Jun 2024 10:48 IST

బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య (Renukaswamy Murder Case) కేసులో అరెస్టయిన నటి పవిత్రా గౌడ ప్రవర్తన నివ్వెరపరుస్తోంది. పోలీసు కస్టడీలో ఆమె (Pavithra Gowda) మేకప్‌ వేసుకుని, లిప్‌స్టిక్‌ రాసుకుని కన్పించిన దృశ్యాలు దుమారం రేపాయి. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

రేణుకాస్వామి హత్య కేసులో విచారణ నిమిత్తం జూన్‌ 15న పవిత్రా గౌడను పోలీసులు బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమె ముఖానికి మేకప్‌ వేసుకుని, లిప్‌స్టిక్‌ రాసుకుంది. లోపలికి మామూలుగా వెళ్లిన ఆమె.. ఆ తర్వాత పోలీసు సిబ్బందితో కలిసి ఇంటినుంచి బయటకువస్తుండగా మేకప్‌తో నవ్వుతూ కన్పించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ హత్యపై ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కన్పించకపోవడంతో పవిత్రపై (Pavithra Gowda) నెట్టింట ఆగ్రహం వ్యక్తమైంది. పోలీసుల తీరును కూడా కొందరు నెటిజన్లు తప్పుబట్టారు.

దర్శన్‌ విచారణ కొలిక్కి

ఈ క్రమంలోనే చర్యలు చేపట్టిన డీసీపీ.. మహిళా ఎస్సైకి నోటీసులు జారీ చేశారు. ‘‘పవిత్రా గౌడతో పాటు వెళ్లిన మహిళా ఎస్సై నటి ప్రవర్తనను గమనించి అడ్డుకోవాల్సింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ ఆ పోలీసు అధికారిణికి నోటీసులు జారీ చేసి వివరణ అడిగాం’’ అని డీసీపీ వెల్లడించారు. మరోవైపు, జైల్లో పవిత్రను ఆమె తల్లి, కుమార్తె కలిశారు. ఆ సమయంలో నటి కన్నీళ్లు పెట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

తన అభిమాన నటుడు దర్శన్‌ (Darshan) వ్యక్తిగత జీవితంలో పవిత్రా గౌడ చిచ్చుపెడుతోందంటూ ఆయన అభిమాని రేణుకాస్వామి సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టాడు. ఈ క్రమంలోనే అతడు హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో పవిత్రా గౌడను ఏ1, దర్శన్‌ను ఏ2గా పేర్కొన్నారు. వీరిపై త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. హత్యకు ముందు అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. మరోవైపు, హత్య అనంతరం మృతదేహాన్ని ఎవరికంటా పడకుండా మాయం చేసేందుకు దర్శన్‌ మరో నిందితుడికి రూ.30 లక్షలు ముట్టజెప్పినట్లు దర్శన్‌ విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని