NEET Row: ముగిసిన నీట్‌ రీ-ఎగ్జామ్‌.. దాదాపు సగం మంది గైర్హాజరు

గ్రేస్‌ మార్కులు కలిపిన విద్యార్థులకు నిర్వహించిన నీట్‌ రీ-ఎగ్జామ్‌కు దాదాపు సగం మంది గైర్హాజరయ్యారు.

Updated : 23 Jun 2024 20:29 IST

దిల్లీ: నీట్‌ (NEET) పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతోన్న వేళ సుప్రీంకోర్టు ఆదేశాలతో గ్రేస్ మార్కులు కలిపిన అభ్యర్థులకు నిర్వహించిన నీట్‌ రీ-ఎగ్జామ్‌ ముగిసింది. ఆదివారం (జూన్‌ 23న) జరిగిన ఈ పరీక్షకు దాదాపు సగం మంది డుమ్మా కొట్టారు! ఏడు సెంటర్లలో మొత్తం 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించగా.. 813మంది మాత్రమే హాజరయ్యారు. 750మంది గైర్హాజరైనట్లు ఎన్‌టీఏ అధికారులు వెల్లడించారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌-యూజీ 2024 పరీక్షా ఫలితాల్లో ఏకంగా 67మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం పట్ల అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో కొందరు అభ్యర్థులు, పలు సంస్థలు కోర్టును ఆశ్రయించడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పరీక్ష రోజున కొన్ని కేంద్రాల్లో సమయం కోల్పోయిన అభ్యర్థులకు గ్రేస్‌ మార్కులు కలిపినట్లు ఎన్‌టీఏ చెప్పింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం గ్రేస్‌ మార్కులు కలిపిన 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలన్న ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం పరీక్ష నిర్వహించారు. 

‘నీట్‌’ వ్యవహారంలో కీలక పరిణామం.. సీబీఐ రంగ ప్రవేశం

అలాగే, నీట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో బిహార్‌లోని పలు సెంటర్లలో మే 5న పరీక్షకు హాజరైన వారిలో 17మందిని డిబార్‌ చేసినట్లు ఎన్‌టీఏ ఆదివారం ప్రకటించింది. పరీక్షలో అక్రమ పద్ధతులకు పాల్పడినందుకు తొలుత 63మంది అభ్యర్థుల్ని డిబార్‌ చేయగా.. శనివారం గుజరాత్‌లోని గోధ్రాలో మరో 30మందిని అధికారులు డిబార్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌, ఇతర వెబ్‌ పోర్టల్స్‌ అన్నీ పూర్తిగా సురక్షితంగానే ఉన్నాయని ఎన్‌టీఏ అధికారులు స్పష్టం చేశారు. వెబ్‌సైట్‌లు హ్యాక్‌ అయ్యాయంటూ తప్పుడు కథనాలు వస్తున్నాయని.. అదంతా తప్పుదారి పట్టించే సమాచారమేనంటూ ‘ఎక్స్‌’ వేదికగా వివరణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని