Lok Sabha: ఎంపీలుగా 535 మంది ప్రమాణం

నూతన లోక్‌సభ తొలి సమావేశాల సందర్భంగా సోమ, మంగళవారాల్లో మొత్తం 535 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేశారు.

Published : 26 Jun 2024 06:08 IST

తొలిరోజు 262, రెండోరోజు 273 మందితో పూర్తి
మిగిలిపోయిన మరో ఏడుగురు సభ్యులు

దిల్లీ: నూతన లోక్‌సభ తొలి సమావేశాల సందర్భంగా సోమ, మంగళవారాల్లో మొత్తం 535 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేశారు. మరో ఏడుగురు సభ్యుల ప్రమాణం మిగిలింది. వీరితో నూతన స్పీకర్‌ తరవాత ప్రమాణం చేయించే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 262 మంది సోమవారం.. మరో 273 మంది మంగళవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. 

రెండో రోజు మంగళవారం ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ పలువురు సభ్యులతో ప్రమాణం చేయించారు. వారిలో కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, ఆయన భార్య డింపుల్‌ యాదవ్, నటి హేమామాలిని (భాజపా), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే(ఎన్సీపీ-ఎస్పీ), నటి కంగనా రనౌత్‌ (భాజపా), అర్వింద్‌ సావంత్‌ (శివసేన-యూబీటీ), మహువా మొయిత్రా (టీఎంసీ), శ్రీకాంత్‌ శిందే (శివసేన) తదితరులు ఉన్నారు. రాహుల్‌ గాంధీ రాజ్యాంగం చిరు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఆంగ్లంలో ప్రమాణం పూర్తిచేశారు. అనంతరం ‘జై హింద్‌’, ‘జై సంవిధాన్‌’ అని నినదించారు. 

  • ప్రమాణాల కార్యక్రమంలో మొదటగా కాంగ్రెస్‌ ఎంపీ (నందుర్‌బార్‌) గోవాల్‌ కగాడా పడావి ప్రమాణం చేశారు. అనంతరం శోభా దినేశ్‌ బచ్చావ్, స్మితా ఉదయ్‌ వాఘ్‌ తదితరులు చేశారు.
  • స్పీకర్‌ పదవికి పోటీపడుతున్న భాజపా ఎంపీ ఓం బిర్లా కూడా మంగళవారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాధా మోహన్‌ సింగ్‌ తన కుర్చీలోంచి లేచి ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు. రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
  • ఎంపీ సుప్రియా సూలే తన ప్రమాణం అనంతరం ప్రొటెం స్పీకర్‌ మహతాబ్‌ కాళ్లకు నమస్కరించారు. అనంతరం భాజపా సీనియర్‌ నేత, కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆశీస్సులు తీసుకున్నారు. 
  • మహారాష్ట్ర ఎంపీలు ప్రమాణం తర్వాత జైహింద్, జై మహారాష్ట్ర, జైభీం, జై శివాజీ అంటూ నినాదాలు చేయగా.. ప్రమాణస్వీకార పత్రంలో ఏముందో అదే చెప్పాలని ప్రొటెం స్పీకర్‌ సభ్యులకు సూచించారు.
  • ప్రమాణం చేయకుండా మిగిలిపోయిన ఎంపీల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన శత్రుఘ్నసిన్హా, దీపక్‌ అధికారి, షేక్‌ నురుల్‌ ఇస్లాం, ఎస్పీకి చెందిన అఫ్జల్, జైలు నుంచి గెలుపొందిన స్వతంత్రులు అమృత్‌పాల్‌ సింగ్, షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ ఉన్నారు. 
  • మణిపుర్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీల ప్రమాణం సందర్భంగా ఆ పార్టీకే చెందిన ఎంపీలంతా ‘మణిపుర్, మణిపుర్‌’ అంటూ నినాదాలు చేశారు. 
  • కాంగ్రెస్‌కు చెందిన అవుటర్‌ మణిపుర్‌ ఎంపీ అల్‌ఫ్రెడ్‌ ఎస్‌ అర్థర్‌ ప్రమాణం అనంతరం ‘మణిపుర్‌కు న్యాయం అందించండి..దేశాన్ని కాపాడండి’ అని పేర్కొన్నారు. 
  • పంజాబ్‌కు చెందిన పలువురు ఎంపీలు పంజాబీలో, మహారాష్ట్ర సభ్యులు మరాఠీ, హిందీలో, ఒడిశా ఎంపీల్లో అత్యధికులు ఒడియాలోనూ కొందరు ఇంగ్లిష్‌లోను ప్రమాణాలు చేశారు.  ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీల్లో అత్యధికులు రాజ్యాంగ ప్రతిని వెంటబెట్టుకుని ప్రమాణాలు చేశారు. 

ఒంటెపై పార్లమెంటుకు వచ్చిన ఎంపీ

రాజస్థాన్‌కు చెందిన భారత్‌ ఆదివాసీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌కుమార్‌ రోత్‌ ప్రమాణస్వీకారానికి ఒంటెపై పార్లమెంట్‌కు వచ్చారు. అయితే, పార్లమెంట్‌ పరిసరాల్లోకి రాగానే ఆయన్ను అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటెను ఇంతకంటే ముందుకు అనుమతించడం కుదరదని చెప్పారు. సిబ్బంది తీరుపై ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పార్లమెంట్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానన్నారు. కాంగ్రెస్‌ మద్దతుతో బాంస్‌వాడా లోక్‌సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని