Ladakh: లద్దాఖ్‌లో నది దాటుతూ ఐదుగురు సైనికుల దుర్మరణం

ఓ నదిని దాటే ప్రయత్నంలో యుద్ధ ట్యాంకులోని ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో శనివారం చోటుచేసుకుంది.

Updated : 30 Jun 2024 05:52 IST

వరదలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు 
మృతుల్లో ప్రకాశం జిల్లా వాసి రామకృష్ణారెడ్డి 

లేహ్, దిల్లీ, గిద్దలూరు పట్టణం-న్యూస్‌టుడే: ఓ నదిని దాటే ప్రయత్నంలో యుద్ధ ట్యాంకులోని ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో శనివారం చోటుచేసుకుంది. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ సైనిక స్థావరానికి చెందినవారు ఒక కసరత్తులో భాగంగా వాస్తవాధీన రేఖ సమీపంలో తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో టి-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేహ్‌కు 148 కి.మీ. దూరంలో మందిర్‌ మోడ్‌ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో రెండు ట్యాంకులు వెళ్తున్నాయి. మంచు కరిగి శ్యోక్‌ నదికి ఆకస్మికంగా వరదలు రావడంతో వీటిలో ఒకటి గల్లంతయింది. గాలింపు చర్యలు చేపట్టినా వరద ప్రవాహ తీవ్రత వల్ల ప్రయోజనం లేకపోయింది. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి (జేసీవో) ముత్తుముల రామకృష్ణారెడ్డి(47) ఉన్నారు. ప్రాణనష్టంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వీర సైనికుల అసమాన సేవల్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని, వారి కుటుంబాలకు అండగా యావద్దేశం నిలుస్తుందని తమ సందేశాల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు- మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ ఈ ఘటనపై విచారం వ్యక్తంచేశారు. 


మరో ఐదు నెలల్లో ఉద్యోగ విరమణ ఉండగా..

జేసీవో రామకృష్ణారెడ్డి 26 సంవత్సరాల క్రితం సైన్యంలో చేరారు. మరో ఐదు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా మృతి చెందడంతో కుటుంబసభ్యులతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. రామకృష్ణారెడ్డికి గిద్దలూరుకు చెందిన ఉమతో వివాహమైంది. వారి ఇద్దరు కుమారుల్లో ఒకరు వాయుసేనలో, మరొకరు సైన్యంలో సేవలు అందిస్తున్నారు. రామకృష్ణారెడ్డిని ఇటీవలే హైదరాబాద్‌లోని యూనిట్‌ కార్యాలయానికి బదిలీ చేశారు. బాధ్యతలు అప్పగించి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విషాదం చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని