NEET UG-2024: నిజ నిర్ధారణకు నాలుగు దశల్లో సీబీఐ విచారణ!

నీట్‌, నెట్‌ యూజీ-2024 పరీక్షల్లో చోటు చేసుకున్న అవకతవకలను నిర్ధరించేందుకు సీబీఐ సిద్ధమైంది. మొత్తం నాలుగు దశల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

Updated : 24 Jun 2024 19:17 IST

దిల్లీ: నీట్‌ యూజీ-2024 (NEET UG-2024), నెట్‌ (NET) పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కేంద్రం ఆదేశాల మేరకు సీబీఐ (CBI) దర్యాప్తునకు సిద్ధమైంది. ఇప్పటికే లీకేజీకి ప్రధాన కేంద్రాలుగా అనుమానిస్తున్న బిహార్‌, గుజరాత్‌ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపించింది. ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. మొత్తం నాలుగు దశల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రశ్నాపత్రం తయారీ నుంచి వాటి ముద్రణ, దేశవ్యాప్తంగా వివిధ పరీక్ష కేంద్రాలకు వాటిని ఎలా పంపించారు? తదితర కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నారు. పరీక్షల నిర్వహణ అంశంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిబంధనలను కచ్చితంగా పాటించిందా? గోప్యతకు భంగం వాటిల్లే విధంగా ఎక్కడైనా ఉల్లంఘనలకు పాల్పడిందా? నీట్‌-యూజీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించినందున సాంకేతికంగా ఏమైనా చొరబాటు జరిగిందా?అనే దిశల్లో విచారించనున్నారు.

అంతేకాకుండా నీట్‌ పరీక్షపత్రం రూపకల్పన నుంచి ప్రింటింగ్‌, రవాణా, పరీక్షలకు ముందు వాటికి భద్రత కల్పించిన వారందర్నీ అవసరం మేరకు విడివిడిగా విచారించే అవకాశముంది. వీరందరిపై సీబీఐ ప్రత్యేకంగా దృష్టిసారించింది. వీరి ద్వారా ఏ దశలోనైనా ప్రశ్నాపత్రం బయటకు వచ్చే అవకాశం ఉందని, కేసు దర్యాప్తులో వీరు కీలకమని సీబీఐ భావిస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ రెండు కేసుల్లో మొత్తం 1000 మంది పేర్లు, వారి మొబైల్‌ నెంబర్లను సీబీఐ ట్రేస్‌ చేస్తోంది. పరీక్షాపత్రాల లీకేజీతో వారికి ఏమైనా సంబంధం ఉందేమో గమనిస్తోంది. దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ-24ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. మొత్తం 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు నెట్‌ పరీక్షను దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించగా 9లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని