Viral post: 16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్‌ వైరల్‌

ట్రాఫిక్‌ రూల్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం దేశం మొత్తం ప్రపంచ కప్పు ఫీవర్‌లో ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాల ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి. 

Updated : 30 Jun 2024 14:13 IST

దిల్లీ: 16 ఏళ్ల నిరీక్షణ అనంతరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్పును చేజిక్కించుకుంది. శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో విజయం సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. రోహిత్‌ సేన పోరాటాన్ని కొనియాడుతున్నారు. వివిధ రాష్ట్రాల పోలీసులు ఈ విజయాన్ని ప్రజావగాహనకు వాడుకొంటున్నారు. క్రికెట్‌ అభిమానుల మనసు గెలుచుకునేలా, సామాన్యులకు అర్థమయ్యేలా ట్రాఫిక్‌ రూల్స్‌ గురించి అవగాహన కల్పిస్తూ దిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. 

‘‘భారత్‌ మరో టీ20 వరల్డ్‌కప్‌ను గెలవడానికి 16 సంవత్సరాల 9 నెలల 5 రోజులు (52,70,40,000 సెకన్లు) మనమందరం వేచి ఉన్నాము. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా కొంచెం ఓపికగా ఉందాం. మంచి క్షణాల కోసం వేచి ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా ఏమి చెప్పగలం? టీం ఇండియాకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ పోస్ట్‌ చేశారు. 

‘‘బ్రేకింగ్ న్యూస్: దక్షిణాఫ్రికా అభిమానుల హృదయాలను బద్దలు కొట్టినందుకు భారత బౌలర్లను దోషులుగా పరిగణిస్తున్నాము. వారికి విధించే శిక్ష మిలియన్ల మంది అభిమానుల నుంచి జీవితకాలం ప్రేమను పొందడమే’’ అని పోస్ట్‌ చేస్తూ యూపీ పోలీసులు తమదైన శైలిలో నెటిజన్లను ఆకర్షించారు.

సంబరాల్లో భాగంగా ముంబయి ట్రాఫిక్ పోలీసులు ‘‘IND 29 జూన్ 2024’’ అనే నంబర్ ప్లేట్ ఉన్న కారులో రోహిత్ శర్మ కూర్చున్నట్లుగా ఫొటోను షేర్‌ చేస్తూ ‘‘డ్రీం కమ్‌ ట్రూ నంబర్ ప్లేట్!  భారత క్రికెటర్లు ప్రపంచ విజేతలు’’ అంటూ రాసుకొచ్చారు. పోలీసులు చేస్తున్న పోస్టులు క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. 

శనివారం జరిగిన టీ20ఫైనల్ మ్యాచ్‌తో కేవలం విజయమే కాదు ఒక శకం ముగిసిందని చెప్పొచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి T20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ద్రవిడ్‌ కోచింగ్‌ వ్యవధి ముగిసింది.  దీనిపై రోహిత్‌ మాట్లాడుతూ తాను అనుకున్నది సాధించాన్నారు. ఇతర క్రికెటర్లకు అవకాశం ఇవ్వడానికి టీ20 మ్యాచ్‌ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని