Pawan kalyan: 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయిని 48 గంటల్లో పట్టుకున్నాం: డిప్యూటీ సీఎం పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 

Updated : 02 Jul 2024 18:33 IST

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇటీవల తన కూతురు కిడ్నాప్‌నకు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూకశ్మీర్‌లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. 9 నెలల క్రితం మిస్సయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాననంటే ప్రభుత్వం తలచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికే. గత అయిదేళ్లలో ఎంత మంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యంపైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగాల్సిన అవసరం ఉంది. 

త్వరలో ఉప్పాడ తీరాన్ని పరిశీలిస్తా..

ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న నేపథ్యంలో దాన్ని ఎలా రక్షించుకోవాలనే అంశంపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తా. ఈ పర్యటన పూర్తయ్యేలా సహకరించాలని అక్కడి యువతను కోరుతున్నా. తీరం కోత గురించి నిపుణుల బృందం అధ్యయనం చేస్తుంది. ఎక్కువ మంది తెలుగు వాళ్లు విదేశాల్లో ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు. మనదేశానికి, రాష్ట్రానికి సంబంధించిన యువత ప్రతిభను ఇక్కడే వినియోగించుకునేలా అవకాశాలు కల్పించాలి. శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని