Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 02 Jul 2024 13:00 IST

1. రెవెన్యూ రికవరీ యాక్ట్‌తో వైకాపా అక్రమార్జనను రాబట్టాలి: చంద్రబాబుకు యనమల లేఖ

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)కు తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తన పరిశీలనలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా నేతల అక్రమార్జనను రెవెన్యూ రికవరీ చట్టంతో రాబట్టాలని సూచించారు. గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన పురోగతి చర్యలు అభినందనీయమని కొనియాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాహుల్‌ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ సోమవారం లోక్‌సభలో చేసిన ప్రసంగం (Rahul Gandhi Speech in Lok Sabha) తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షం తరఫున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రారంభించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అగ్నివీర్‌, మైనార్టీ తదితర అంశాలపై మోదీ (PM Modi) సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో కాకరేపుతున్న పార్టీ ఫిరాయింపులు

పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపాల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. ఫిరాయింపులకు కేసీఆరే ఆధ్యుడని రేవంత్‌ విమర్శిస్తే.. ఆయారామ్‌ గయారామ్‌ల సంస్కృతికి అంకురార్పణ చేసిందే కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ ఎదురు దాడి చేశారు. పీసీసీ అధ్యక్షునిగా చేరికల్ని వ్యతిరేకించిన రేవంత్‌.. ఇప్పుడు ఎలా కండువాలు కప్పుతున్నారని భాజపా దుయ్యబట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అమెరికాలో బిలియన్‌ డాలర్ల స్కామ్‌లో భారతీయులకు జైలు

అమెరికా(USA)లో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడినట్లు తేలడంతో జైలు శిక్ష విధించారు. ఒకప్పుడు చికాగోలోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్‌ మోసాలకు పాల్పడినట్లు ఈసందర్భంగా న్యాయస్థానం పేర్కొంది. ఔట్‌కమ్‌ హెల్త్‌ పేరిట రిషి షా, శ్రద్ధా అగర్వాల్‌లు ఓ హెల్త్‌ మీడియా సంస్థను 2006లో ఏర్పాటుచేశారు. ఈ కంపెనీ డాక్టర్ల వద్ద స్క్రీన్‌లు, టాబ్లెట్లను ఏర్పాటు చేసింది. వీటిల్లో పేషెంట్లను టార్గెట్‌ చేసుకొని వివిధ కంపెనీల మెడికల్‌ అడ్వర్టైజింగ్‌ ప్రకటనలు ప్రసారం చేసేది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రజనీకాంత్‌తో స్నేహంపై కమల్‌ హాసన్‌ కామెంట్స్

వారి అద్భుతమైన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటులు కమల్‌హాసన్‌, రజనీకాంత్ (Rajinikanth). కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. వీళ్లిద్దరూ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. తాజాగా తమ మధ్య అనుబంధాన్ని తెలియజేస్తూ కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విద్యుత్‌ లేక చీకట్లలో 10 కోట్ల మంది ప్రజలు

ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో గాఢాంధకారం అలుముకుంది. సరైన విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. 20 కోట్లకుపైగా జనాభా కలిగిన నైజీరియాలో సగం మంది ప్రజలు చీకట్లలోనే జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా కరెంట్ లేకపోవడంతో వ్యాపారాలు, ప్రజా సేవలు దెబ్బతింటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ నిలిచిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. గర్భవిచ్ఛిత్తి పోస్ట్‌పై మస్క్‌ వర్సెస్‌ కమలా హ్యారిస్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో గర్భవిచ్ఛిత్తి కీలకాంశంగా మారింది. బైడెన్‌ నేతృత్వంలోని డెమోక్రాట్లు నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్‌ నాయకత్వంలోని రిపబ్లికన్లు మాత్రం కొన్ని పరిమితులు ఉండాలని వాదిస్తున్నారు. దీనిపై ఇటీవల సోషల్‌ మీడియా సహా ప్రచార కార్యక్రమాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పై బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk Vs Kamala Harris) విమర్శలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్‌

నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఓయూ జేఏసీ నేత మోతీలాల్ నాయక్‌ విరమించారు. తొమ్మిది రోజుల నుంచి ఆయన దీక్ష చేస్తున్నారు. దీక్ష విరమణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘తొమ్మిది రోజుల దీక్షలో రాష్ట్రంలో ఒక్క ఉద్యోగమూ పెరగలేదు. అన్న పానీయాలు లేకుండా నిరవధిక దీక్ష చేశా. నా ఆరోగ్యం సరిలేకపోవడంతో దీక్షను విరమిస్తున్నా’’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మాస్టారు బదిలీ.. కన్నీటిపర్యంతమైన విద్యార్థులు

బదిలీపై వేరే పాఠశాలకు వెళుతున్న గురువును చూసి విద్యార్థులు భావోద్వేగానికి గురైన ఘటన భువనగిరి జిల్లా మోత్కూరు మండలం కొండగడపలో చోటుచేసుకుంది. ఇన్నాళ్లు తమ ఉన్నతి కోసం పరితపించి తరగతి పాఠాలే కాదు.. జీవిత పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడి చుట్టూ చేరి తమను వీడి వెళ్లిపోవద్దంటూ వెక్కివెక్కి ఏడ్చారు. 11 ఏళ్లపాటు ఉపాధ్యాయుడు హనుమంతు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. పిల్లలంతా బడిలో చేరేలా ప్రోత్సహించారంటూ స్థానికులు కొనియాడారు. పిల్లల ప్రేమానురాగాలు చూసి తను ఉద్వేగానికి గురయ్యారు గురవు హనుమంతు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మాకు 80 సీట్లు వచ్చినా ఈవీఎంలను విశ్వసించం: అఖిలేశ్‌ యాదవ్

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరుగుతోన్న చర్చలో విపక్ష నేతలు మోదీ సర్కార్‌పై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఎస్పీ అధినేత, ఎంపీ అఖిలేశ్‌ యాదవ్ (Akhilesh Yadav) పేపర్‌ లీక్‌, ఈవీఎంలు, అయోధ్య ఎన్నికల ఫలితాలు, ఉత్తర్‌ప్రదేశ్‌లో అవినీతి గురించి మాట్లాడారు. ‘‘ఎన్నికల సమయంలో 400 సీట్లు అంటూ వారు ప్రచారం చేశారు. కానీ ప్రజలు మాకు నైతిక విజయం కట్టబెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువకాలం ఉండదని అంతా చెప్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాల ఆధారంగా దేశాన్ని నడిపించలేరు’’ అని భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని