Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 Jun 2024 20:55 IST

1. టీమ్‌ఇండియాకు రూ.125 కోట్ల బహుమతి ప్రకటించిన బీసీసీఐ

టీ20 ప్రపంచ కప్‌ 2024ను సాధించిన భారత జట్టుకు బీసీసీఐ (BCCI) భారీ బహుమతిని ప ప్రకటించింది. రూ.125 కోట్ల నగదును ఆటగాళ్లకు అందించనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రకటన చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రవీంద్ర జడేజా

అంతర్జాతీయ టీ20లకు భారత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా వీడ్కోలు పలికాడు. భారత్ తాజాగా సాధించిన 2024 టీ20 ప్రపంచ కప్‌లో జడేజా సభ్యుడిగా ఉన్నాడు. 2009లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన జడేజా ఇప్పటివరకు 74 టీ20 మ్యాచ్‌లు ఆడి 515 పరుగులు చేసి.. 54 వికెట్లు పడగొట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటన రద్దు

మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6,100 టీచర్‌ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ప్రధాని మోదీతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా: చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి మరోసారి అరకు కాఫీ ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గిరిజనులు పండించే అరకు కాఫీ గొప్పతనం గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విశాఖలో అరకు కాఫీ రుచి చూసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మోదీ ట్వీట్‌పై చంద్రబాబు స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేరేడ్‌మెట్‌లో బాలికపై గ్యాంగ్‌ రేప్‌.. 10మంది అరెస్టు

నేరేడ్‌మెట్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్‌ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కిడ్నాప్‌ చేసిన నిందితులు.. కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి తాగించారు. బాలిక మత్తులోకి జారుకున్న తర్వాత నిర్మానుష్యప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?

పశ్చిమబెంగాల్‌  రాష్ట్రంలో జరిగిన ఓ అమానవీయ ఘటనపై ప్రతిపక్ష భాజపా (BJP), సీపీఎం (CPM) పార్టీలు మండిపడుతున్నాయి. నడి రోడ్డుపై చుట్టూ జనం గుమిగూడి ఉండగా.. ఇద్దర్ని ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు? అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌లో చదువు కంటే వివాహాలపైనే ఖర్చెక్కువ: జెఫరీస్‌

సగటు భారతీయులు చదువుతో పోలిస్తే వివాహంపైనే రెండింతలు అధికంగా ఖర్చు చేస్తున్నట్లు ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ వెల్లడించింది. భారత వివాహ పరిశ్రమ పరిమాణం రూ.10 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది. ఆహారం, నిత్యావసరాల తర్వాత స్థానం దీనిదేనని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ పార్టీ ఎంపీకే ‘డిప్యూటీ’ ఇవ్వండి.. టీఎంసీ విజ్ఞప్తి

18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డిప్యూటీ స్పీకర్‌ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు.. ఆ పదవిలో తమ కూటమి ఎంపీకే ఇవ్వాలని కేంద్రంలోని భాజపా యోచిస్తోంది. మరోవైపు.. విపక్ష కూటమిలో భాగమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) మాత్రం సమావాజ్‌వాదీ పార్టీ (SP) ఎంపీకే ఆ సీటు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు సంబంధిత వర్గాల సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికలు.. ‘హిందూ’ ఓట్లపై పార్టీల కన్ను!

బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో అక్కడ హిందూ ఓటర్లపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి, కన్జర్వేటివ్‌ పార్టీ నేత రిషి సునాక్‌, లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌లు అక్కడ హిందూ దేవాలయాలను సందర్శించి, తమ విధానాలతో ఆ వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా..! వారంలోనే 800 బాంబులతో విధ్వంసం

ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా (Russia) విరుచుకుపడుతోంది. గత వారం 800కుపైగా బాంబులతో విధ్వంసం సృష్టించింది. తాజాగా జపోరిజియా రీజియన్‌లోని విల్నియాన్స్క్‌ పట్టణంపై జరిపిన క్షిపణుల దాడిలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందారు. మరో ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 37 మందికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని