Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 Jun 2024 12:59 IST

1. కుప్పంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు

కుప్పం పట్టణం: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. స్థానిక ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న ప్రజలు.. తమ సమస్యలను సీఎంకు వివరించారు. పూర్తి కథనం

2. శంషాబాద్‌లో చిరుత సంచారం.. ఆచూకీ కోసం 20 కెమెరాలతో నిఘా

హైదరాబాద్‌: శంషాబాద్‌లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. దీంతో ఘాన్సీమియాగూడలో అటవీ శాఖ అధికారులు గాలిస్తున్నారు. చిరుత ఆచూకీ కోసం 20 కెమెరాలతో పాటు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో అడవి పిల్లి కదలికలు కనిపించాయి.పూర్తి కథనం

3. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి బుజ్జగింపులు.. దిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి ఆ పార్టీ నేతల బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఆయనతో మాట్లాడారు. తాజగా దిల్లీకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ నుంచి పిలుపు వచ్చింది.పూర్తి కథనం

4. జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్‌

హైదరాబాద్‌: సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు (జూడా) ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. ఈక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.పూర్తి కథనం

5. దిల్లీ మద్యం కుంభకోణం.. సీబీఐ కస్టడీలోకి సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) అరెస్టు చేసేందుకు కేంద్ర దర్యాప్తు బృందానికి కోర్టు బుధవారం అనుమతించింది. దీనిపై న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.పూర్తి కథనం

6. అబ్దుల్‌ కలాం ఫోన్‌ చేస్తే రాంగ్‌ నంబర్‌ అని చెప్పా: సుధామూర్తి

ఇన్ఫోసిస్‌ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగానే కాక.. రచయిత్రి, వితరణశీలిగా ఎంతోమందికి సుపరిచితురాలు సుధామూర్తి (Sudha Murty). తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్‌ చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి తనకు ఓసారి ఫోన్‌ వచ్చిందని తెలిపారు. పూర్తి కథనం

7. వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు అసాంజేకు విముక్తి.. సొంత దేశం ఆస్ట్రేలియాకు పయనం

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేకు (Julian Assange) విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలను ఎదుర్కొంటూ ఇన్నాళ్లూ బ్రిటన్‌లో తలదాచుకున్న ఆయనను విడిచిపెట్టాలని అమెరికా న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో ప్రత్యేక విమానంలో ఆయన తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు.పూర్తి కథనం

8. సెక్షన్ 80సి పరిమితి ఈసారైనా పెరిగేనా?.. చివరిసారి ఎప్పుడు సవరించారు?

ఆదాయపు పన్ను (Income tax) చెల్లింపుదారులకు సెక్షన్‌ 80సి (80C) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బడ్జెట్‌ వచ్చిన (Budget 2024) ప్రతిసారీ వేతన జీవులు ఆశగా ఎదురుచూసే వాటిలో శ్లాబుల సవరణ ఒకటైతే.. రెండోది సెక్షన్‌ 80సి రెండోది. కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.పూర్తి కథనం

9. ‘ఫేక్‌ ఇన్‌జూరీ’ ఆరోపణలు.. గుల్బాదిన్‌పై చర్యలు ఉంటాయా? ఐసీసీ రూల్స్‌ ఏంటంటే?

టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) అఫ్గానిస్థాన్‌ తొలిసారి సెమీస్‌కు దూసుకొచ్చింది. సూపర్-8 స్టేజ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించి నాకౌట్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే, బంగ్లాదేశ్‌తో పోరు సందర్భంగా అఫ్గాన్‌ ఆటగాడు గుల్బాదిన్‌ నైబ్ (Gulbadin Naib) తొడ కండరాలు తిమ్మిరి ఎక్కినట్లు ఒక్కసారిగా కింద పడిపోయాడు. పూర్తి కథనం

10. అఫ్గాన్‌ సెమీస్‌కు రిజర్వ్‌ డే.. భారత్‌కు మాత్రం లేదు.. ఎందుకలా..?

ఈసారి పొట్టి ప్రపంచకప్‌ (T20 World Cup)లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మొదటి సెమీస్‌కు రిజర్వ్‌డే ఉండగా.. రెండో దానికి ఆ సౌకర్యం లేదు. దీంతో అదేంటీ అందరికీ ఒక రూల్‌.. టీమ్‌ ఇండియాకు మరో రూలా అని ఫ్యాన్స్‌ చర్చించుకొంటున్నారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు