Smart City Mission: స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువు పొడిగించిన కేంద్రం

తెలంగాణలో స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

Updated : 30 Jun 2024 18:19 IST

హైదరాబాద్‌: స్మార్ట్‌ సిటీ మిషన్‌ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. సీఎం రేవంత్‌రెడ్డి వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్రం.. ఈ పథకం పనుల గడువును పొడిగించింది. దిల్లీ పర్యటనలో భాగంగా ఈనెల 24న సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిశారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్‌ వరకు పొడిగించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ గత ఒప్పందం ప్రకారం స్మార్ట్‌ సిటీ మిషన్‌ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. రాష్ట్రంలో వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో స్మార్ట్‌ మిషన్‌ పనులు కొనసాగుతున్నాయి. 

వరంగల్‌లో ఇప్పటి వరకు 45 శాతం పనులు పూర్తి కాగా.. రూ.518 కోట్లతో మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్‌లో 25 పనులు పూర్తి కాగా.. రూ. 287 కోట్లతో 22 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్‌ గడువు పొడిగించాలని కేంద్రాన్ని సీఎం కోరారు. స్పందించిన కేంద్రం 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రానికి లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, కొత్త పనులు ఉండవని లేఖలో పేర్కొంది. జరుగుతోన్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పద్ధతిలో విడుదల చేస్తామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని