RERA: రెండు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు ‘రెరా’ షోకాజ్‌ నోటీసులు

సోనెస్టా ఇన్ఫినిటి, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ‘రెరా’ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 18 Jun 2024 18:02 IST

హైదరాబాద్‌: సోనెస్టా ఇన్ఫినిటి, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ‘రెరా’ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సోనెస్టా ఇన్ఫినిటీ ప్రమోటర్ గచ్చిబౌలి కేర్ హాస్పిటల్ వెనుక ఉన్న జయభేరి పైన్‌ కాలనీలో స్కై విల్లాస్ నిర్మాణాలకు ‘రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా సోషల్ మీడియా ద్వారా బ్రోచర్ విడుదల చేసి ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. అదే విధంగా హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్స్ ‘బ్రిస్సా’ ప్రాజెక్టు పేరుతో బ్రోచర్ విడుదల చేసి వెబ్‌సైట్‌, సోషల్ మీడియా ద్వారా ప్రజలను, కొనుగోలుదారులను ఆకర్షించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు. ఈ విషయం ‘రెరా’ అథారిటి దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆయా ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసు జారీ చేశామని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ఆ సంస్థలు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు అథారిటీ తెలిపింది.

‘రెరా’ చట్టంలోని 3(1), 4(1) నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఏజెంట్లు తప్పనిసరిగా తమ ప్రాజెక్టులను ‘రెరా’లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రెరా అథారిటీ తెలిపింది. ఏవైనా ప్రాజెక్టుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సెక్షన్ 59 ప్రకారం జరిమానా విధించడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పింది. ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు ‘రెరా’ రిజిస్ట్రేషన్‌ పూర్తయిన ప్రాజెక్టుల్లో మాత్రమే కొనుగోలు చేయాలని.. ప్రీలాంచ్ ఆఫర్లు, మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని అథారిటీ విజ్ఞప్తి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు