Ramoji Rao: రామోజీరావుకు పుష్పాంజలి ఘటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన  రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 

Updated : 27 Jun 2024 17:05 IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత రామోజీరావు (Ramoji Rao) సంస్మరణ సభకు పలువురు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, రామోజీరావు కుటుంబ సభ్యులు, ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్, శేఖర్‌ గుప్తా, గులాబ్‌ కొఠారి, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు హాజరై పుష్పాంజలి ఘటించారు. పత్రికా రంగంతోపాటు వివిధ రంగాల్లో రామోజీరావు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా ఆయన సంస్మరణ సభను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. వేదిక వద్ద రామోజీరావు జీవిత విశేషాలతో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ సహా ప్రముఖులు వీక్షించారు.

కృష్ణా జిల్లాలోని మారుమూల గ్రామం పెదపారుపూడిలో జన్మించిన రామోజీరావు.. అంచెలంచెలుగా ఎదిగారు. ‘ఈనాడు’తోపాటు ‘ఈటీవీ’ ప్రసారాలతో మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు. ప్రకృతి విపత్తుల్లో ప్రజల వెన్నంటి నిలిచారు. ‘మార్గదర్శి’తో మధ్యతరగతి ప్రజలకు పొదుపుపై అవగాహన కల్పించారు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా అందించారు. ఆయన నిర్మించిన రామోజీ ఫిలింసిటీ గిన్నిస్‌ బుక్‌ రికార్డును సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని