Kcr: విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారం.. కమిషన్‌ రద్దుపై విచారణ వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.

Published : 27 Jun 2024 14:03 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ను రద్దు చేయాలంటూ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. విచారణ అనంతరం కేసీఆర్‌ తరఫు న్యాయవాది ఆదిత్య మీడియాతో మాట్లాడారు. ‘‘విద్యుత్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలను వెల్లడించారు. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధం. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల కొంత గడువు కోరారు. నోటీసులకు సమాధానం ఇవ్వకముందే జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయం తీసుకున్న తర్వాతే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. ఏఆర్‌సీ కూడా జ్యుడిషియరీ సంస్థ. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని కమిషన్ చెబుతోంది. దేశంలో ఎన్నో పవర్ ప్లాంట్లను ఈ పద్ధతి ప్రకారం నిర్మించారు. పవర్‌ ప్లాంట్ల నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అనుమతి కూడా ఉంది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలపై ప్రత్యేకంగా కమిషన్ వేయొద్దని తెలిసినా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కేసీఆర్‌ సమాధానం ఇవ్వకముందే విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌ జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తప్పు జరిగిందన్నట్టుగా మాట్లాడారు’’ అని న్యాయవాది ఆదిత్య అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు