Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పూజలు.. జనసేన కార్యాలయంలో సూర్యారాధన

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యారాధన ఆచరించారు.

Updated : 04 Jul 2024 20:42 IST

అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సమాజ క్షేమం, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ సూర్యారాధన చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఆయన గురువారం సూర్యారాధనలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆదిత్య యంత్రం ఎదుట ఆశీనులై ప్రత్యక్ష భగవానుడిని ఆరాధించారు. ఈ సందర్భంగా వేద పండితులు సూర్యుని విశిష్ఠతను తెలియజేశారు. 

ప్రజల జీవన విధానంలో సూర్య నమస్కారాలు ఒక భాగమని వివరించారు. వనవాసంలో ధర్మరాజు ప్రత్యక్ష భగవానుడిని ప్రార్థించి అక్షయ పాత్ర పొందారని మహా భారతం చెబుతోందన్నారు. బ్రిటిష్ పాలకుల ప్రభావంతో ఆదివారం అంటే సెలవు దినంగా మారిపోయిందని, నిజానికి మన దేశ సంస్కృతిలో ఆదివారానికి విశిష్టత ఉందన్నారు. రవివారం అని పిలిచే ఆ రోజు సూర్యుడిని ఆరాధించి పనులకు శ్రీకారం చుట్టేవారని గుర్తు చేశారు. అందుకే ఆదివారాన్ని కృషివారం అని కూడా అంటారని వేద పండితులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని