AP DSC: వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటన రద్దు

గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 30 Jun 2024 18:32 IST

అమరావతి: మెగా డీఎస్సీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జులై 1న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో.. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో 6,100 టీచర్‌ పోస్టులు మాత్రమే ఉన్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించింది. 

ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించని వారు, ఈ టెట్‌ ప్రకటన తర్వాత బీఈడీ, డీఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డీఎస్సీతోపాటు టెట్‌ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్, మెగా డీఎస్సీకి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్‌ నిర్వహిస్తారు. ఆ తర్వాత డీఎస్సీకి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డీఎస్సీ పరీక్ష ఉంటుంది. జులై 1న మెగా డీఎస్సీ, టెట్‌కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు.  గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. కానీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని