Nara Lokesh: మంత్రి నారా లోకేశ్‌ ‘ప్రజాదర్బార్‌’కు అనూహ్య స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు

మంత్రి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్”కు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు.

Updated : 03 Jul 2024 12:21 IST

అమరావతి: మంత్రి నారా లోకేశ్‌ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్‌’కు మంచి స్పందన లభిస్తోంది. బుధవారం ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు. లోకేశ్‌ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.  

దివ్యాంగులకు గత తెదేపా ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తమకు మంజూరు చేసిన ఇళ్లకు వైకాపా ప్రభుత్వం తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురిచేసిందని చెప్పారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కల నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని కోరారు. సమస్యను విన్న మంత్రి.. చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తన కుమార్తెకు పూర్తిస్థాయి అంగవైకల్యం ఉందని, దివ్యాంగ పింఛన్‌ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ భానుబీ కోరారు. నులకపేటకు చెందిన ఆంజనేయులు దివ్యాంగ పింఛన్ కోసం లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని, ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎమ్.వంశీకృష్ణ కోరారు. గత ప్రభుత్వంలో నిలిపివేసిన రైతు కూలీ పింఛన్‌ను పునరుద్ధరించాలని యర్రబాలెంకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావు విన్నవించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు నీట్ పరీక్ష ద్వారా బి-కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందని, ఫీజు రాయితీ కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా అనంతవరానికి చెందిన సీహెచ్‌ అనూష విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్‌ వారికి భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు