Gottipati: రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలు.. రక్షణ చర్యలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 23 Jun 2024 21:14 IST

అమరావతి: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో వరుస ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్‌ నెలలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఇద్దరు సముద్రంలో గల్లంతై మృతి చెందారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. సముద్రతీరంలో వరుస ప్రమాదాలు జరుగుతూ యువకులు చనిపోతుంటే ఎందుకు నష్ట నివారణ చర్యలు చేపట్టట్లేదని అధికారులను నిలదీశారు. తక్షణమే గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం మెరైన్‌ పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు.

సమీపంలో రిసార్ట్స్‌ ఉండటంతో విహార యాత్రకు వచ్చిన యువత ప్రమాదాలకు గురవుతున్నారని మంత్రికి అధికారులు వివరించారు. రిసార్ట్స్‌ యాజమాన్యం కూడా ప్రమాదాల నివారణకు బాధ్యత తీసుకునేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. పోలీస్‌, రెవెన్యూ, పర్యాటక ఇతరశాఖల అధికారులతో పాటు రిసార్ట్స్‌ యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు