Kavitha: దిల్లీ హైకోర్టులో కవితకు నిరాశ.. బెయిల్‌ పిటిషన్లు తిరస్కరణ

భారాస ఎమ్మెల్సీ కవితకు దిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆమె దాఖలు చేసిన రెండు బెయిల్‌ పిటిషన్లను దిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

Published : 01 Jul 2024 17:50 IST

దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కవితకు దిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆమె బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను దిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ, ఈడీ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో ప్రమేయం ఉందన్న ఆరోపణలతో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేసి దిల్లీకి తరలించిన విషయం తెలిసిందే. వారం రోజుల ఈడీ కస్టడీ అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించాక.. ఏప్రిల్‌లో విచారణ సందర్భంగా సీబీఐ రెండు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించింది. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. తర్వాత ఆమెను కోర్టులో హాజరు పరచగా.. 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కవిత జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంటున్నారు. 

దీంతో తనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులపై బెయిల్‌ కోరుతూ గతంలో రెండు వేర్వేరు పిటిషన్లను దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో కవిత దాఖలు చేయగా.. విచారించిన ఆ న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. దీంతో ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను ఆమె దిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. కవితను నిరాధార ఆరోపణలతో అరెస్టు చేశారని, ఒక పార్టీకి కీలక నేతగా ఉన్నా ఆమెకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా ఉంచారంటూ ఆరోపిస్తూ ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఈడీ, సీబీఐ తరఫున  వాదనలు వినిపిస్తూ.. దిల్లీ మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం దిల్లీ మద్యం కేసు కీలక దశలో కొనసాగుతున్న తరుణంలో ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే  అవకాశం ఉందని వాదించారు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో ఆమెకు బెయిల్‌ మంజూరు చేయొద్దని కోరారు. సీబీఐ, ఈడీ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు కవిత పిటిషన్లను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు