Vijayawada: పీసీబీ దస్త్రాల దహనం కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) ఫైల్స్‌ దహనం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Updated : 10 Jul 2024 16:26 IST

విజయవాడ: పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) ఫైల్స్‌ దహనం కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పెనమలూరు సీఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసు బృందం బుధవారం విజయవాడలోని పీసీబీ ప్రధాన కార్యాలయంలో విచారణ చేపట్టింది. కార్యాలయం నుంచి దస్త్రాలు బయటకు వెళ్లడంపై పీసీబీలోని ఏడు విభాగాల్లోని అధికారులను ప్రశ్నించారు. ఫైల్స్‌, హార్డ్‌ డిస్క్‌లు బయటకు వెళ్లటంలో అధికారుల పాత్ర, కాల్చిన దస్త్రాల్లోని అంశాలు, వాటి ప్రాధాన్యతపై ఆరా తీశారు. దస్త్రాల్లోని సమాచారంపై సిబ్బంది వాంగ్మూలాలు నమోదు చేశారు.

ఇటీవల కృష్ణా కరకట్టపై దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి పెనమలూరు పోలీసులు భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 106 కింద కేసు నమోదు చేశారు. సమీర్‌ శర్మ వద్ద ఓఎస్డీగా పనిచేసిన రామారావు, డ్రైవర్‌ నాగరాజు, అటెండర్‌ రూపేంద్రలను స్టేషన్‌కు పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. దస్త్రాల్ని తీసుకొచ్చిన వాహనాన్ని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దస్త్రాల దహనంపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. కారకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ‘పీసీబీలో దస్త్రాలు, రికార్డులు, వాటి నిర్వహణ, భద్రపరిచేందుకు అనుసరిస్తున్న విధివిధానాలపై వెంటనే నివేదిక ఇవ్వండి. జోనల్, రీజనల్‌ కార్యాలయాల్లో రికార్డుల నిర్వహణపై దృష్టిపెట్టండి. వాటి భద్రతపై తనిఖీ చేయండి’ అని ఇప్పటికే అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని