Pinnelli: వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

పోలీసుల అరెస్టు నుంచి తనకు రక్షణ కోరుతూ మాచర్ల వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

Updated : 26 Jun 2024 16:58 IST

అమరావతి: ఎన్నికల సందర్భంగా అరాచకాలకు పాల్పడిన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన నాలుగు కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం నాలుగు ముందస్తు బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించింది.

ఎన్నికల పోలింగ్‌ రోజు పాల్వయిగేటు పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలుకొట్టడంతో పాటు అడ్డుకోబోయిన తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్‌ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారు. వీటన్నింటి మీదా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు  పిటిషన్లు జూన్‌ 20న హైకోర్టులో వాదనలు ముగియగా.. ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. పోలీసుల తరఫున స్పెషల్‌ కౌన్సిల్‌గా న్యాయవాది ఎన్‌.అశ్వినికుమార్‌ వాదించారు. ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని