Andhra News: కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం

కృష్ణా నది కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Updated : 04 Jul 2024 15:09 IST

అమరావతి: కృష్ణా నది కరకట్టపై దస్త్రాలను తగులబెట్టిన అంశంలో పూర్తిస్థాయి విచారణకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి వేళ రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై బస్తాలను దించి తగులబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతోపాటు కంప్యూటర్‌ హార్డు డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. మరో వైపు పీసీబీ దస్త్రాల దహనంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని ఆదేశించారు. దస్త్రాల దహనం వెనుక ఎవరెవరు ఉన్నారని పవన్‌ ఆరా తీసినట్టు సమాచారం. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకెళ్లాలని ఆదేశించారు.

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏపీ16 ఈఎఫ్‌ 2596 నంబరు గల ఇన్నోవా కారులో కొందరు వ్యక్తులు కరకట్ట పైకి వచ్చారు. ఈ వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్‌ ఉంది. వీరు పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్‌ కాలనీ వద్ద కారు నిలిపి, అందులో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలబెట్టడం మొదలుపెట్టారు. అటుగా వెళ్తున్న ఓ తెదేపా కార్యకర్త దీన్ని గమనించారు. దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్‌ సమీర్‌శర్మ చిత్రాలు ఉండడంతో ఆయన వెంటనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, తెదేపా నేతలకు సమాచారం అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని