TG News: తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీ

తెలంగాణలో సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది.

Published : 02 Jul 2024 20:19 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్‌ కార్యాలయం ఆమోదం తెలపడంతో 213 మంది ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. వీరిలో 205 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఒక్కొక్కరు రూ.50వేల సొంత పూచీకత్తు సమర్పించాలని, 3 నెలలకోసారి జిల్లా ప్రొబేషన్‌ అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. విడుదల కానున్న ఖైదీలందరికీ తప్పనిసరిగా ఉపాధి కల్పించాలని గవర్నర్‌ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. వీరికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌లు లాంటి చోట్ల ఉపాధి కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. వారితో జైళ్ల శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సౌమ్యమిశ్రా బుధవారం మాట్లాడి.. అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. 

ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గాంధీ జయంతి లాంటి సందర్భాల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తుంటారు. అయితే, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే ఇది కార్యరూపం దాల్చింది. 2016లో తొలిసారిగా ఖైదీలను విడుదల చేశారు. రెండోసారి 2020 అక్టోబరు 2న 141 మందిని విడుదల చేశారు. 2022లో 150 మందిని విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినా పలు కారణాలతో ఆమోదం లభించలేదు. ఈ ఏడాది జనవరిలోనే విడుదలకు జైళ్ల శాఖ జాబితా తయారు చేసినప్పటికీ తాజాగా మార్గం సుగమమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని