విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి

బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌ కోరారు. మంచి నాయకులు కావాలా, వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలని సూచించారు.

Updated : 29 Jun 2024 06:14 IST

రాష్ట్రంలో పెరిగిన మత్తుపదార్థాల వినియోగం
తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్‌

అభివాదం చేస్తున్న విజయ్‌

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: బాగా చదువుకున్నవారు రాజకీయాల్లోకి రావాలని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌ కోరారు. మంచి నాయకులు కావాలా, వద్దా అనేది విద్యార్థులే నిర్ణయించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రాజకీయాలు ఒక సబ్జెక్టుగా విద్యార్థులకు ఉండాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు పార్టీ తరఫున బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. శుక్రవారం చెన్నై తిరువాన్మియూర్‌లో జరిగిన కార్యక్రమంలో 21 జిల్లాలకు చెందిన 800 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. రాష్ట్రస్థాయిలో ప్లస్‌టూలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ప్రతీషా(చెన్నై), మహాలక్ష్మి(తిరుప్పూర్‌), దోషితలక్ష్మి (చెంగల్పట్టు)కి వజ్రాల కమ్మలు అందించారు. 10వ తరగతిలో మొదటి ఆరుస్థ్థానాల్లో నిలిచినవారికి వజ్రాల ఉంగరాలు ఇచ్చారు. నాంగునేరికి చెందిన చిన్నదురై అనే విద్యార్థికి రూ.5వేలు ప్రోత్సహక నగదు అందించారు.

కావాల్సింది ఉత్తమ నాయకులే..

విజయ్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి ఇష్టమైన కోర్సు ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు చాలామంది ఉన్నారని చెప్పారు. ఇప్పుడు ఎక్కువగా అవసరమయ్యేది ఉత్తమ నాయకులేనని ఆయన తెలిపారు. నాయకుడు అనేది రాజకీయపరంగానే కాదని, నచ్చిన సబ్జెక్టులో ఉత్తమంగా రాణించినా అత్యున్నత పదవికి రావచ్చన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సందేశాలు విద్యార్థులు నమ్మకూడదన్నారు. అవి ఎంతవరకు నిజమో విశ్లేషించుకోవాలని కోరారు. వ్యసనాలకు బానిసై చక్కటి జీవితాన్ని చేజార్చుకోవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో మత్తుపదార్థాల వినియోగం అధికంగా ఉందని చెప్పారు. ఈ విషయాన్ని తండ్రిగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా చూస్తుంటే భయంగా ఉందన్నారు. వాటిని అడ్డుకోవడంతో పాలనా ప్రభుత్వం విఫలమైందన్నారు. మత్తుపదార్థాలు వద్దంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

విద్యార్థినులను సన్మానిస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని