అధికారిక లాంఛనాలతో డీఎస్‌ అంత్యక్రియలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సంతాపం తెలిపారు.

Updated : 29 Jun 2024 18:29 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ మృతి పార్టీకి, బలహీన వర్గాలకు తీరని లోటని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇరువురు నేతలు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. డీఎస్‌ కుమారులు సంజయ్‌, అరవింద్‌ను పరామర్శించి వారి అనుమతితో డీఎస్‌ పార్థివదేహంపై కాంగ్రెస్‌ జెండా కప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి డీఎస్‌ చేసిన సేవలను కొనియాడారు. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. రెండు సార్లు ఉమ్మడి ఏపీకి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారని, పార్టీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 2004, 2009లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని