Telangana news: డ్రగ్స్‌ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య: మంత్రి సీతక్క

డ్రగ్స్‌ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య అని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు.

Published : 26 Jun 2024 20:02 IST

హైదరాబాద్‌: డ్రగ్స్‌ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న సమస్య అని మంత్రి సీతక్క అన్నారు. మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు. వాటికి అలవాటు పడితే సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మాఫియా కోట్లు సంపాదిస్తోందని ధ్వజమెత్తారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనల్లో డ్రగ్స్ లేదా గంజాయి కారణం అవుతోందని తెలిపారు. యవత పబ్‌ కల్చర్‌కు అలవాటు పడకుండా తల్లిదండ్రులు పెట్టుకున్న కలలను నిజం చేయాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

అన్నింటికంటే మానవుడిగా పుట్టడం అదృష్టం. డ్రగ్స్ సైలెంట్ కిల్లర్‌లాంటివి. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలలు కనాలి. వాటిని నిజం చేసుకోవాలి. కానీ, కొందరు డ్రగ్స్ మహమ్మారి ఊబిలో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మూడు నెలల్లోనే రెండు సార్లు ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష చేశారు. డ్రగ్స్ రవాణా, సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యాం. - మంత్రి జూపల్లి

తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి కృషి చేస్తున్న పోలీసులను అభినందించాలి. తరచూ వార్తల్లో యువత డిప్రెషన్ కారణంగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని వింటున్నాం. అలా జరగకుండా చూసుకోవాల్సి బాధ్యత మనందరిపై ఉంది. చిన్న వయసులో ఆర్థికంగా స్థిరపడటం ముఖ్యం. మిథాలీరాజ్‌లా మంచి పేరును సంపాదించడం ముఖ్యం. డ్రగ్స్ వాడుతున్న వారు ఉంటే వారిని మార్చేందుకు ప్రయత్నించండి. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు గమనిస్తుండాలి. -తేజ సజ్జ, సినీనటుడు 

నిత్యం మాదక ద్రవ్యాల వార్తలు చూస్తునే ఉన్నాం. డ్రగ్స్ ఆరోగ్యానికి ఎంత నష్టం కలిగిస్తుందో యువత గ్రహించాలి. తెలంగాణా పోలీసు శాఖ డ్రగ్స్ కట్టడికి తీవ్రంగా కృషి చేస్తోంది. డ్రగ్స్‌కు బానిసలైన వారిని కూడా మామూలు వ్యక్తులుగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అందరికీ అవగాహన ఉండాలి. తెలియని వారికి ఈ విషయాలను వివరించాలి. - మిథాలీరాజ్, మాజీ క్రికెటర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని