డీఎస్‌ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్‌ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

Updated : 29 Jun 2024 18:38 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీఎస్‌ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్‌ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. సుదీర్ఘ కాలం పార్టీకి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డీఎస్‌ పార్థివదేహానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు.

ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం..

డీఎస్‌ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్‌ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం డీఎస్‌ పనిచేశారని చంద్రబాబు తెలిపారు. 

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు. డీఎస్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదాన్ని వినిపించిన వ్యక్తి డీఎస్‌ అని చెప్పారు.

కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాక‌రమని ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారని గుర్తుచేశారు. ధర్మపురి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు లోకేశ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

డి.శ్రీనివాస్‌ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని పేర్కొన్నారు. 2004-2009 వరకు అసెంబ్లీలో డీఎస్‌ ప్రోత్సాహం మరువలేనిదన్నారు. డి.శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్‌ మృతి పట్ల మాజీ మంత్రి, భారాస నేత హరీశ్‌రావు నివాళి అర్పించారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్‌ సుదీర్ఘ కాలం సేవలందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

డీఎస్‌ మృతి పట్ల మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్‌ ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచారని.. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

మరోవైపు పార్టీలకతీతంగా పలువురు నాయకులు డీఎస్‌కు నివాళులర్పించారు. వారిలో ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, భాజపా ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్‌, రఘునందన్‌రావు, తెలంగాణ భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ రఘువీర్‌రెడ్డి ఉన్నారు.

ఆదివారం అంత్యక్రియలు..

డీఎస్‌ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి.. మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం దిల్లీలో ఉన్న డీఎస్‌ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం భౌతిక కాయాన్ని నిజామాబాద్‌కు తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు