Ramoji rao: అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు: సీఎం రేవంత్‌ ఆదేశాలు

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 08 Jun 2024 14:12 IST

హైదరాబాద్‌: ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత  చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

‘‘రామోజీరావు మరణం చాలా బాధాకరం. పత్రికలు, ప్రసార మాధ్యమాల రంగంలో దేశానికే ఆయన ఆదర్శంగా నిలిచారు. పత్రికలు, ప్రసార సాధనాలు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయని నిరూపించారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేశారు. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే ఆయన మృతి తీరని లోటు’’ అని రేవంత్‌ అన్నారు.

రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని