Hyderabad: ఊదమంటే.. బ్రీత్‌ ఎనలైజర్‌ లాక్కెళ్లాడు!

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల ఏమరుపాటును అదనుగా తీసుకున్న ఓ వాహనదారుడు బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కుని వెళ్లాడు.

Updated : 29 Jun 2024 08:49 IST

ప్రతీకాత్మక చిత్రం

కంటోన్మెంట్, న్యూస్‌టుడే: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసుల ఏమరుపాటును అదనుగా తీసుకున్న ఓ వాహనదారుడు బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కుని వెళ్లాడు. బోయిన్‌పల్లి లా అండ్‌ ఆర్డర్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణరెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగయ్యలు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 27న అర్ధరాత్రి దాటాక ట్రాఫిక్‌ పోలీసులు పుల్లారెడ్డి బంగ్లా దాటిన అనంతరం వచ్చే ట్రాఫిక్‌ పాయింట్‌ చౌరస్తాలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో వర్షం పడుతుండటంతో ముందుగా వచ్చిన ఓ కారును నడుపుతున్న డ్రైవర్‌కు పరీక్షలు చేయగా అతడు మద్యం తాగలేదని తేలింది. వెనుకగా వచ్చిన కారును పోలీసులు ఆపారు. కారును బ్యారికేడ్లకు అవతలి వైపు తీసుకెళ్లిన కానిస్టేబుల్‌ మహేందర్‌ డ్రైవింగ్‌ సీటులో ఉన్న వ్యక్తిని పరీక్షించేందుకు బ్రీత్‌ ఎనలైజర్‌లో ఊదమన్నాడు. అతడు ఊదినట్లే నటించి కానిస్టేబుల్‌ చేతిలో ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కుని ఉడాయించాడు. తేరుకున్న ట్రాఫిక్‌ పోలీసులు కారును వెంబడించినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే వర్షం కురుస్తుండడం, అర్ధరాత్రి ట్రాఫిక్‌ లేకపోవడంతో నిందితుడు కారును వేగంగా తీసుకెళ్లిపోవడంతో నెంబరును గుర్తించలేకపోయినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని