TG -AP: విభజన సమస్యలే అజెండా.. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీకి ప్రజాభవన్‌లో ఏర్పాట్లు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated : 05 Jul 2024 17:14 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం 6గంటలకు ప్రజాభవన్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటి సారి. ప్రధానంగా షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశముంది.

విద్యుత్‌ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశముంది. దాదాపు రూ.24వేల కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. కానీ, రూ.7వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి నెలలో సీఎం చొరవతో దిల్లీలో ఏపీ భవన్‌కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవలే మైనింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన నిధుల పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి.

షెడ్యూల్‌ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబేడీ కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించి అభ్యంతరాలేమీ లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. పదో షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేడ్కర్‌ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని