Vangalapudi Anitha: కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా?: ఏపీ హోంమంత్రి అనిత

నాలుగు అంశాలను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.

Updated : 27 Jun 2024 15:03 IST

అమరావతి: నాలుగు అంశాలను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి నిర్మూలన, మహిళలకు రక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘రెడ్‌ బుక్‌’ కక్ష సాధింపు చర్యలకు కాదన్నారు. గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని చెప్పారు. తమకు కక్ష సాధింపు ఉంటే.. ఇంతకాలం ఆగుతామా?అని వ్యాఖ్యానించారు. పగ, ప్రతీకారాల ఆలోచన చేయడం లేదని.. తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన‌ ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పారు. డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

‘‘ఈ 12 రోజుల్లో చాలా అంశాలను పరిశీలించా. వైకాపా ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు. కేవలం బందోబస్తుకే వాడారు. ఒక్క కానిస్టేబుల్‌ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. పోలీసు అకాడమీ, గ్రేహౌండ్‌ అకాడమీ లేదు. కేంద్రం నుంచి నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణం పూర్తిచేయలేదు. నేటికీ విశాఖపట్నం జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌ రేకుల షెడ్డులోనే నడుస్తోంది. ఎస్కార్ట్‌ వాహనాలు కూడా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. 2014లో ఇచ్చినవే ఇప్పటికీ వాడుతున్నారు. ఠాణాల్లో స్టేషనరీ ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. 

గంజాయి రవాణా రాష్ట్రంలో బాగా పెరిగింది. నేషనల్ క్రైం రికార్డులో రాష్ట్రాన్ని మూడో స్థానంలోకి తెచ్చారు. గంజాయి నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇప్పటికే ఉపసంఘం ఏర్పాటు చేశాం. 100 రోజుల ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలనేదానిపై చర్చిస్తాం. ప్రజల భాగస్వామ్యంతోనే గంజాయిని అరికట్టేందుకు వీలుంటుంది. మంచి ఆలోచనతో పనిచేస్తే విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు. ఎలాంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులను పెట్టారు. ఏ విధంగా వారు పోలీసు విధులు చేయగలరు?వారిని ఏ విధంగా వినియోగించాలనేదానిపై ఆలోచన చేస్తున్నాం.

కలిసి కట్టుగా పనిచేసి పోలీసుల పనితీరులో మార్పు తెస్తాం. ప్రజలు ధైర్యంగా స్టేషన్‌కు వెళ్లి బాధలు చెప్పుకొనేలా భరోసా ఇవ్వాలి. సిబ్బంది ప్రజలతో మర్యాదగా మెలగాలి. రాష్ట్రంలో ఆడపిల్లల అదృశ్యం ఘటనలు చాలా ఉన్నాయి. ఫిర్యాదులతో ఎవరైనా వస్తే వారిని కించపరిచేలా మాట్లాడవద్దు. పోలీసులు అంటే ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టులకే గత ప్రభుత్వం వినియోగించింది. ఇకపై ఫ్రెండ్లీ పోలీసింగ్‌ రావాలి. సోషల్‌ మీడియాలో నేటికీ నేను బాధితురాలినే. కొంతమంది ఐపీఎస్‌ అధికారుల తీరుతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది. గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టారు. నాపైనే 23 కేసులు నమోదు చేశారు. అసభ్య పోస్టులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. అక్రమ కేసులపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. పోలీసులంటే ప్రజల్లో ఒక నమ్మకం, గౌరవం తీసుకొస్తాం. ఏపీలో దిశ చట్టమే లేదు.. ఇక ఆ స్టేషన్ల పేరు కూడా మార్చే ఆలోచన చేస్తాం’’అని హోం మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు