AP News: విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం

విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డి అవినీతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Published : 29 Jun 2024 20:45 IST

కడప: కడప జిల్లా విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డి అవినీతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణాధికారిగా విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ను నియమించింది. రాఘవరెడ్డి అక్రమాలపై మంత్రి నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ప్రభుత్వం విచారణ చేపట్టింది.  

‘ఆర్జేడీ రాఘవరెడ్డి గతంలో డీఈవోగా పనిచేస్తున్న సమయంలో వైకాపా నేతలతో అంటకాగుతూ విధులు నిర్వర్తించారు. ఉపాధ్యాయులను దూషించడం, మహిళా ఉపాధ్యాయినులతో అసభ్యకరంగా ప్రవర్తించడం, వారిని ఇష్టానుసారంగా బదిలీలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుల కౌన్సెలింగ్‌ లేకుండా లంచాలు తీసుకుని బదిలీలు, డిప్యుటేషన్లు చేయడమే కాకుండా వీటిపై ప్రశ్నించిన వారిని విధుల నుంచి తొలగించారు. ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు పాటించకున్నా అనుమతులిచ్చారు. 2023, మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు మద్దతుగా పనిచేశారు. ఆయన తీరుపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తే నా అంతు చూస్తానని ఆర్జేడీ బెదిరించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈయన కోట్లాది రూపాయలు వసూలు చేసి అక్రమ బదిలీలు చేశారు’ అని భూమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని