Wheeler Island: ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..

ఒడిశా తీరంలోని వీలర్‌ దీవిని ‘డీఆర్‌డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది..

Updated : 25 Jun 2024 10:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: ‘‘సార్‌.. మన దేశం స్వావలంబనతో క్షిపణులను తయారుచేస్తోంది. ప్రయోగాలకు సరైన దీవి మీ రాష్ట్రంలోనే ఉంది. మాకు కేటాయించండి’’ - క్షిపణి కేంద్ర డైరెక్టర్‌ అబ్దుల్‌ కలాం అభ్యర్థన.

‘‘మీ క్షిపణి చైనాలోని లక్ష్యాలను ఛేదించగలదా? అలా అయితేనే వీలర్‌ దీవిని కేటాయిస్తాను’’- అప్పటి ఒడిశా సీఎం బిజూపట్నాయక్‌ సమాధానం.

‘‘కచ్చితంగా సార్‌. అంతకంటే ఎక్కువ దూర లక్ష్యాలను ఢీకొట్టగల క్షిపణులను కూడా తయారుచేస్తాం’’- అబ్దుల్‌ కలాం.

ఆ వెంటనే ఒడిశా తీరంలోని వీలర్‌ దీవిని ‘డీఆర్‌డీవో’కు కేటాయించారు బిజు బాబు.

కాలగమనంలో భారత క్షిపణి పితామహుడిగా ఖ్యాతికెక్కిన కలాం దేశ రాష్ట్రపతిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ దీవిని కేటాయించిన బిజు బాబుకు దేశభక్తి ఎక్కువ. రక్షణ రంగంలో భారత్‌ అసమానమైన ప్రతిభ చూపించాలన్నదే ఆయన అభిమతం.

క్షిపణి ప్రయోగ కేంద్రంగా..

అంతకు ముందు చిన్న క్షిపణులను చాందీపుర్‌ నుంచి ప్రయోగించేవారు. అయితే భారీ క్షిపణుల ప్రయోగానికి ప్రజానివాసాలకు దూరంగా ఉండేందుకు దీవి ఉంటే బాగుంటుందని శాస్త్రవేత్తలు యోచించారు. చాందీపుర్‌ సముద్ర తీరానికి సమీపంలోని వీలర్‌ దీవిని గుర్తించారు. దీన్ని పరిశీలించేందుకు ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక నాటుపడవలో వెళ్లారు. ఒక రోజు రాత్రి అక్కడే విశ్రమించి పూర్తిగా అధ్యయనం చేసి అన్నివిధాలుగా క్షిపణి ప్రయోగాలకు సరిపోతుందని భావించారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్‌ కలాంకు తెలపడంతో ఆయన పట్నాయక్‌ దగ్గరకు వెళ్లడం, ఆయన అంగీకరించడం వెంటనే జరిగిపోయాయి.

ఇంతింతై..

అబ్దుల్‌ కలాం చొరవతో ప్రారంభమైన క్షిపణి కేంద్రం ఖండాంతర క్షిపణులను కూడా ప్రయోగించే స్థాయికి చేరుకుంది. రక్షణ రంగానికి చెందిన ఎలాంటి ఆయుధాలకయినా పరీక్షలు ముఖ్యం. పరీక్షలతోనే వాటి లోటుపాట్లు తెలుస్తాయి. ఇలా పలు ప్రయోగాల అనంతరం భారత అమ్ములపొదిలో చేరుతున్నాయి. వీలర్‌ దీవికి ‘అబ్దుల్‌ కలాం దీవి’గా పేరుపెట్టారు. 

అన్నట్టు బిజు బాబుకు హమీ ఇచ్చినట్టుగానే మన దేశ క్షిపణులు చైనాలోని ఏ లక్ష్యాన్నయినా ఛేదించగలవు. కొన్నాళ్ల క్రితం వరకు ఆసియాలో క్షిపణుల రంగంలో తిరుగులేదని భావించిన చైనా.. మన ఖండాంతర క్షిపణి ‘అగ్ని’ పరీక్ష విజయవంతం కావడంతో ఆందోళన చెందుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని